IPL 2024 : పవన్ కల్యాణ్ ఈ పాటే నాకు బూస్ట్...: నితీష్ రెడ్డి నోట పవర్ స్టార్ పాట
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ ఇప్పుడు క్రికెట్ కు పాకింది. ఆయన సినిమాలోని ఓ పాటను తనకెంతో ఇష్టమంటూ పాడి వినిపించాడు సన్ రైజర్స్ జట్టు సంచలన ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి.
హైదరాబాద్ : ఒక్క మ్యాచ్... కేవలం ఒకే ఒక్క ఇన్నింగ్స్ అతడిని ఓవర్ నైట్ స్టార్ ని చేసేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఇప్పటికే అనేకమంది యువ క్రికెటర్స్ టాలెంట్ వెలుగులోకి రాగా ఇప్పుడు అతడి వంతు వచ్చింది. తోటి టీమ్మేట్స్ తడబడుతున్న పిచ్ పై అతడు మాత్రం అలవోకగా బౌండరీలు బాదాడు. కష్టాల్లో వున్న జట్టును పటిష్టమైన స్థితికి చేర్చి హీరో అయ్యాడు. ఇలా చాలాకాలం తర్వాత క్రికెట్ లో మెరిసిన తెలుగుతేజం నితీష్ కుమార్ రెడ్డి. పంజాబ్ కింగ్స్ పై పూనకాలు తెప్పించే ఇన్నింగ్స్ ఆడిన ఈ తెలుగబ్బాయి గురించి తెలియనివారు లేరు. అసలు ఎవరీ నితీష్ రెడ్డి? అతడి బ్యాగ్రౌండ్ ఏమిటి? ఇంత టాలెంట్ పెట్టుకుని ఇంతకాలం ఎక్కడ వుండిపోయాడు?... ఇలా నితీష్ గురించి తెలుసుకునేందుకు క్రికెట్ ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తన గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు నితీష్.
విశాఖపట్నంకు చెందిన ఈ కుర్రాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. ఈ విషయాన్ని అతడే వెల్లడించారు. అంతేకాదు తనకు పవర్ స్టార్ సినిమాలోని ఓ సాంగ్ ఎంతగానో ఉత్తేజ పరుస్తుందని నితీష్ తెలిపారు. జానీ సినిమాలోని 'నారాజు గాకుర మా అన్నయ' సాంగ్ తనకెంతో బూస్ట్ ఇస్తుందని తెలిపాడు. ఈ సందర్భంగా ఆ సాంగ్ ను పాడాడు నితీష్ రెడ్డి. నితీష్ కూడా తమ హీరో ఫ్యాన్ అని తెలిసి పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఇదిలావుంటే తమ కొడుకు అద్భుత ఇన్నింగ్స్ ను చూసి నితీష్ తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పంజాబ్ కింగ్స్ ను ధీటుగా ఎదుర్కొని సన్ రైజర్స్ కు విలువైన పరుగులు అందించి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన కొడుకును వారు అభినందించారు. కొడుకును గట్టిగా హత్తుకుని తండ్రి ముత్యాలు రెడ్డి ముద్దాడాడు. ఇక నితీష్ తల్లి కళ్లలో కొడుకును పట్టుకుని ఎమోషన్ అయ్యారు. ఆ తల్లి కళ్లలో ఆనందం స్పష్టంగా కనిపించింది. ఈ ఎమోషనల్ సీన్ కు మొహాలీ స్టేడియం వేదికయ్యింది.
నితీష్ రెడ్డి వీరోచిత ఇన్నింగ్స్ ఇలా సాగింది...
పంజాబ్ కింగ్స్ టీం హోంగ్రౌండ్ మొహాలీ. సొంత మైదానంలో ఆ జట్టు అద్భుతంగా ఆడుతుంది. ఇలా సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో కూడా పంజాబ్ బౌలర్లు రెచ్చిపోయారు. మొదట బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ జట్టు కేవలం 39 పరుగులకే మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది. దీంతో ఇక సన్ రైజర్స్ పని అయిపోయిందని అందరూ భావించారు. అప్పుడు క్రీజులోకి వచ్చాడు నితీష్ రెడ్డి. ఇతడు కూడా పంజాబ్ బౌలింగ్ దాటికి తట్టుకోలేక తొందరగానే పెవిలియన్ కు చేరతాడని అనుకున్నారు. కానీ అతడు మాత్రం మెల్లిగా కుదురుకున్నాక పరుగుల సునామీ సృష్టించాడు.
కళ్లుచెదిరే సిక్సర్లు, చక్కటి ఫోర్లు బాదుతూ కేవలం 37 బంతుల్లోనే 64 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఒక్కసారిగా నితీష్ కుమార్ రెడ్డి స్టార్ ప్లేయర్స్ జాబితాలో చేరిపోయాడు. ఇంత అద్భుతంగా బ్యాటింగ్ చేసిన అతడు తెలుగు కుర్రాడని తెలిసి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనందిస్తున్నారు. ఇప్పుడు పవన్ సినిమా సాంగ్ పాడి పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసాడు నితీష్ రెడ్డి.