హైదరాబాద్ ను గెలిపించాడు... కొడుకుగా గెలిచాడు : తల్లి చేతికి అభిషేక్ శర్మ అవార్డులు
సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన ఆటతోనే కాదు ఫ్యామిలీ ఎమోషన్స్ తో అభిమానుల మనసు దోచుకున్నాడు. ఉప్పల్ స్టేడియంలో ఎంటర్టైన్ మెంట్ మాత్రమే కాదు ఎమోషన్స్ పండించాడు.
హైదరాబాద్ : ఐపిఎల్ 2024 సీజన్ మరో ఆసక్తికర మ్యాచ్ కు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికయ్యింది. సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన అద్భుతమైన మ్యాచ్ ను అభిమానులు ఎంతగానో ఆస్వాదించారు. చెన్నై ఫ్యాన్స్ కు మహేంద్ర సింగ్ ధోనిని చూసిన ఆనందం... హైదరాబాద్ ఫ్యాన్స్ కు తమ జట్టు విజయాన్ని అందుకున్న సంతోషం ఈ మ్యాచ్ ద్వారా కలిగింది. ఇలా కేవలం అద్భతమైన మ్యాచ్ కే కాదు అంతకంటే గొప్ప ఎమోషన్స్ కు ఉప్పల్ స్టేడియం వేదికయ్యింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై విసిరిన 166 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ సునాయాసంగా చేధించింది. ఇందుకు సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్ కారణం. అతడు కేవలం 12 బంతుల్లోనే 37 పరుగులతో చెలరేగాడు. ఇతడి పరుగుల సునామీతో సన్ రైజర్స్ విజయం లాంఛనంగా మారిపోయింది. ఇలా పరుగుల వరదతోనే కాదు తన ఫ్యామిలీ ఎమోషన్స్ తో హైదరాబాద్ ఫ్యాన్స్ మనసు దోచుకున్నాడు అభిషేక్ శర్మ.
ఏ తల్లిదండ్రులకైనా కొడుకు ఎదుగుదలకు మించిన ఆనందం ఇంకెముంటుంది. ఇదే ఆనందం అభిషేక్ శర్మ తల్లి కళ్లలో కనిపించింది. కొడుకు ఆటను చూసి మైమరిచిపోయిన ఆ తల్లి మ్యాచ్ తర్వాత మైదానంలోకి వచ్చారు. అద్భుత ఆటతీరుతో హైదరాబాద్ ను గెలిపించిన అభిషేక్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, పంచ్ ఈవి ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కాయి. ఈ అవార్డులను అందుకున్న వెంటనే వాటిని తల్లిచేతికి అందించి మైదానంలోకి తీసుకువచ్చాడు అభిషేక్. రెండు చేతుల్లో అవార్డులు పట్టుకుని... పక్కనే వున్న కొడుకును హత్తుకుని ఆ తల్లి ఆనందంతో మురిసిపోయింది. ఇలా ఆటగాడిగానే కాదు తల్లికి అవధుల్లేని సంతోషాన్ని ఇచ్చిన కొడుకుగా కూడా అభిషేక్ వర్మ మరో మెట్టు ఎక్కేసాడు.
ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడ్డాయి.. చెన్నైని షేక్ చేసిన అభిషేక్ శర్మ !
తల్లితో పాటు చెల్లితో కూడా తన సంతోషాన్ని పంచుకున్నాడు అభిషేక్. ఇద్దరిని వెంటపెట్టుకుని మైదానంలోకి వచ్చిన అతడు ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఓ అవార్డు తల్లిచేతిలో, మరో అవార్డు చెల్లిచేతిలో పెట్టి వారి ఆనందమే తన ఆనందంగా మురిసిపోయాడు అభిషేక్. ఇలా ఉప్పల్ స్టేడియం కేవలం రసవత్తర మ్యాచ్ కే కాదు ఫ్యామిలీ ఎమోషన్స్ కు వేదిక అయ్యింది.
అభిషేక్ వర్మ ఊచకోత సాగిందిలా :
చెన్నై విసిరిన 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కు ఓపెనర్ అభిషేక్ వర్మ శుభారంభం అందించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు రెండో ఓవర్లోనే 27 పరుగులు పిండుకున్నాడు. సిఎస్కే బౌలర్ చౌదరిని ఉతికారేస్తూ 4, 0, 6, 0, నోబాల్ 6, 6, 4 తో చేలరేగాడు అభిషేక్. ఆ తర్వాత కూడా అతడి షో కొనసాగింది. అయితే ఆ తర్వాతి ఓవర్ లో ఒక సిక్సర్, ఫోర్ కోట్టిన అభిషేక్ మరో భారీ షాట్ ఆడే క్రమంలో ఔటయ్యాడు. ఇలా కేవలం 12 బంతుల్లోనే 37 పరుగులు చేసి సిఎస్కేకు చేయాల్సిన నష్టం చేసేసాడు. అతడి వేసిన పునాదులపై హైదరాబాద్ జట్టు విజయాన్ని నిర్మించుకుంది. ఇలా హోంగ్రౌండ్ ఉప్పల్ లో సన్ రైజర్స్ మరో విజయాన్ని అందుకుంది.