జులై 10, 2019. న్యూజిలాండ్‌తో వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌. భారత్‌ క్రికెట్‌ అభిమానులు మరిచిపోయేందుకు ప్రయత్నించే రోజు ఇది. కానీ, అది అంత సులభం కాదు. వరల్డ్‌కప్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగి, లీగ్‌ దశలో ఏడు విజయాలు సాధించి.. సెమీఫైనల్లో గెలుపు లాంఛనమే అనుకున్న తరుణంలో వరల్డ్‌కప్‌ నుంచి నిష్క్రమించింది భారత్‌. 

రవీంద్ర జడేజా, ఎం.ఎస్‌ ధోనిల పోరాటాన్ని ఓ అనూహ్య రనౌట్‌ వృథా చేసింది. 2019 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌ నిష్క్రమణ టీమ్‌ ఇండియా స్వీయ వినాశనమేనని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కోచ్‌ టామ్‌ మూడీ అభిప్రాయపడ్డారు. 

'మీకు నచ్చినా, నచ్చకపోయినా భారత్‌ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ప్రతిభ, ప్రదర్శనలపై విపరీత అంచనాలు. క్రికెట్‌లో మరే జట్టుకు సాధ్యపడని రీతిలో భారత్‌ మాత్రమే నాణ్యమైన క్రికెటర్లను కలిగి ఉంది. కానీ కొన్నిసార్లు ఇది భారంగా పరిణమిస్తుంది. చాలా మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు అందుబాటులో ఉన్నప్పుడు ఎవరిని ఎంచుకోవాలిలనే ప్రణాళిక తికమకగా తయారవుతుంది. అందుకు చక్కని ఉదాహరణ 2019 వరల్డ్‌కప్‌. ఏడాదికి ముందే భారత్‌ వరల్డ్‌కప్‌కు సర్వసన్నద్ధంగా కనిపించింది. కానీ తర్వాత కాలంలో నం.4 బ్యాట్స్‌మన్‌ అనిశ్చితి స్వీయ వినాశనానికి దారితీసింది. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు, డ్రెస్సింగ్‌రూమ్‌లో అనిశ్చితి వాతావరణం జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపాయి. జట్టు మేనేజ్‌మెంట్‌ ప్రతిభను సద్వినియోగం చేసుకోవటంలో దారుణ వైఫల్యం చెందింది' అని టామ్‌మూడీ అన్నాడు.