IPL 2024 : నాన్నా... నీ త్యాగం వృధాకాలేదు : తెలుగుతేజం నితీష్ రెడ్డి ఎమోషనల్ జర్నీ

కేవలం 37 బంతుల్లో 67 పరుగులు... అందులో ఐదు సిక్సులు, నాలుగు ఫోర్లు... నితీష్ కుమార్ రెడ్డి ఈ అద్భుత ఇన్నింగ్సే సన్ రైజర్స్ కు మరో విజయాన్ని అందించింది. ఒక్క మ్యాచ్ లో అతడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. కానీ అతడి విజయం వెనక తండ్రి గొప్ప త్యాగం వుందని ఎంతమందికి తెలుసు?

SRH All Rounder Nitish Kumar Reddy sensational innings in IPL 2024 AKP

హైదరాబాద్ : అది మొహాలీ స్టేడియం... ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ టీం కేవలం 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో వుంది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చాడు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. అతడేం చేస్తాడు... మిగతా సన్ రైజర్స్ బ్యాట్ మెన్స్ లాగే అతడినీ తొందరగానే పెవిలియన్ పంపుతామని పంజాబ్ భావించాడు. కానీ అతడు మాత్రం మెల్లిగా ఇన్నింగ్స్ ప్రారంభించి కొద్దిగా కుదురుకున్నాక తన విశ్వరూపం చూపించాడు. కళ్లుచెదిరే సిక్సర్లు, చక్కటి ఫోర్లు బాదుతూ కేవలం 37 బంతుల్లోనే 64 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఒక్కసారిగా నితీష్ కుమార్ రెడ్డి స్టార్ ప్లేయర్స్ జాబితాలో చేరిపోయాడు. 

ఎవరీ నితీష్ కుమార్ రెడ్డి ?

ఒకే ఒక సుడిగాలి ఇన్పింగ్స్ తో వెలుగులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి అచ్చతెలుగు కుర్రాడు. అతడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం అతడి స్వస్థలం. చిన్నప్పటి నుండే క్రికెట్ పై మక్కువ పెంచుకున్న నితీష్ కుటుంబ ప్రోత్సాహంతో ఆ దిశగానే అడుగులు వేసాడు. విశాఖ గల్లీల్లో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న అతడు ఇప్పుడు ఐపిఎల్ లో అదరగొడుతున్నాడు. 

నితీష్ కోసం తండ్రి త్యాగం : 

నితీష్ కుమార్ రెడ్డిది దిగువ మధ్యతరగతి కుటుంబం. అతడి తండ్రి ముత్యాల రెడ్డి విశాఖలోని హిందుస్థాన్ జింక్ లో చిన్న ఉద్యోగి. అతడి నెల జీతమే ఆ కుటుంబానికి జీవనాధారం. మంచి ఉద్యోగం, అంతకంటే మంచి కుటుంబంతో జీవితం హాయిగా సాగుతుండగా ముత్యాల రెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. క్రికెటర్ కావాలన్న తన కొడుకు కలను నెరవేర్చేందుకు ఏకంగా తన ఉద్యోగాన్నే వదిలేసాడు ముత్యాల రెడ్డి. 

హిందుస్తాన్ జింక్ సంస్థ ముత్యాల రెడ్డిని విశాఖపట్నం నుండి రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు బదిలీ చేసింది. కానీ అప్పటికే తన కొడుకును క్రికెటర్ గా తీర్చిదిద్దే పనిలో వున్నాడు ముత్యాల రెడ్డి. ఇలాంటి కీలక సమయంలో తన ఉద్యోగం గురించి ఆలోచిస్తే కొడుకు కెరీర్ నాశనం అవుతుందని భావించాడో ఏమో ఒక్క క్షణం కూడా  ఆలోచించకుండా తన జాబ్ ను వదిలేసాడు. ఇలా హిందూస్తాన్ జింక్ లో ఉద్యోగానికి రాజీనామా చేసిన ముత్యాల రెడ్డి కొడుకు కోసమే పూర్తిసమయం కేటాయించాడు. ఇలా కొడుకు కోసం ఏ తండ్రీ చేయని త్యాగం చేసాడు ముత్యాల రెడ్డి.

చిన్నప్పటి నుండి కుటుంబ పరిస్థితిని చూస్తూ పెరిగాడు... తండ్రి త్యాగాన్ని చూసాక నితీష్ రెడ్డిలో మరింత కసి పెరిగింది. దీంతో క్రికెట్ ఒక్కటే అతడి జీవిత లక్ష్యంగా మారింది. తండ్రి ముత్యాల రెడ్డి ఆర్థిక కష్టాలున్నా కొడుకు విషయంలో ఏనాడూ రాజీ పడలేదు. ఎలాగోలా అతడు కోరింది సమకూర్చేవాడు. అంతేకాదు కొడుకుకు తానే ఓ కోచ్ గా మారి క్రికెటర్ గా రాటుదేలేలా తీర్చిదిద్దాడు. ఆ తండ్రి కష్టానికి ఫలితమే ఇప్పుడు నితీష్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్. 

గల్లీ క్రికెట్ నుండి ఐపిఎల్ వరకు నితీష్ ప్రయాణం :  

ఐదో ఏటే బ్యాట్ పట్టిన నితీష్ ఇప్పటివరకు దాన్ని వదల్లేదు. హిందూస్తాన్ జింక్ కంపనీ మైదానంలో జరిగే క్రికెట్ మ్యాచ్ లు చూస్తూ పెరిగాడు. స్నేహితులంతా స్కూల్ కు వెళుతుంటే నితీష్ మాత్రం గ్రౌండ్ కు వెళ్లేవాడు. అతడి అభిరుచిని గుర్తించిన కుటుంబం ఆ దిశగానే ప్రోత్సహించింది. కానీ చదువుకునే వయసులో ఈ ఆటలేంటి... ఇవి ఏమైనా కడుపు నింపుతాయా అంటూ బంధువులు నితీష్ తండ్రిని మందలించేవారు. కానీ అతడు మాత్రం తన కొడుకుపై  పూర్తి నమ్మకాన్ని వుంచాడు. 

అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్  లో రాటుదేలిన నితీష్ టీమిండియా మాజీ ప్లేయర్ ఎమ్మెస్కే ప్రసాద్ కంటపడ్డాడు. అతడి టాలెంట్ ను గుర్తించిన ఎమ్మెస్కే కడపలోని ఏసిఏ అకాడమీలో చేరేందుకు సహకరించాడు. అక్కడే నితీష్ పరిపూర్ణమైన క్రికెటర్ గా మారాడు. 

దేశవాళి క్రికెట్ కెరీర్ :

దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్రా తరఫున ఆడే అవకాశం నితీష్ కుమార్ రెడ్డికి దక్కింది. ఆల్ రౌండర్ గా సత్తాచాటిన అతడు ఇండియ అండర్ 19 బీ టీమ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఇతడు 566 పరుగులు చేశాడు. ఆంధ్ర తరుపున రంజీ ట్రోఫీలో 7 మ్యాచ్‌లు ఆడి 366 పరుగులు చేశారు. అందులో ఒక సెంచరీ కొట్టాడు.

చక్కటి బ్యాటింగ్, అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో సన్ రైజర్స్ టీం మేనేజ్ మెంట్ ద‌ృష్టిలో పడ్డాడు. దీంతో అతడిని వేలంలో రూ.20 లక్షల కనీస ధరకు దక్కించుకుంది హైదరాబాద్ టీం. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతడు తాజా ఇన్పింగ్స్ తో స్టార్ గా మారాడు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios