మహిళల టీ20 వరల్డ్ కప్‌లో మ్యాచ్ నుంచి తప్పుకోవాల్సిందిగా సౌతాఫ్రికా క్రికెటర్‌ని బెదిరించిన బంగ్లా క్రికెటర్... కెరీర్ నాశనం చేస్తానంటూ బెదిరింపులు! ఆడియో లీక్... విచారణ మొదలెట్టిన ఐసీసీ... 

పురుషుల క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టించిన మ్యాచ్ ఫిక్సింగ్, ఇప్పుడు మహిళా క్రికెట్‌ని పాకింది. ప్రస్తుతం సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో స్పాట్ ఫిక్సింగ్‌ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి కారణం బంగ్లాదేశ్‌ మహిళా క్రికెటర్, సౌతాఫ్రికా క్రికెటర్‌తో మాట్లాడిన ఫోన్ సంభాషణలు లీక్ అవ్వడమే...

‘నేను చెప్పినట్టు చేయకపోతే, నీకు కెరీర్ ఉండదు. ఒక్క మ్యాచ్ ఆడితే, ఆ తర్వాత మళ్లీ టీమ్‌లోకి వచ్చే అవకాశమే ఉండదు..’ అంటూ బంగ్లాదేశ్ ఉమెన్ క్రికెటర్, సౌతాఫ్రికా మహిళా క్రికెటర్‌ని బెదిరించింది. అయితే ఈ బెదిరింపులకు లొంగని ఆ సౌతాఫ్రికా మహిళా క్రికెటర్... ‘ఇలాంటి పనులు నా జీవితంలో ఎప్పుడూ చేయను.. నన్ను బెదిరించాలని ప్రయత్నించకు’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది...

ఈ ఫోన్ సంభాషణను బంగ్లాదేశ్‌కి చెందిన ఓ టీవీ ఛానెల్ ప్రసారం చేయడం విశేషం. అయితే ఇది నిజంగా రెండు దేశాల క్రికెటర్ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణయేనా? లేక ఫేక్ ఆ... అనేది తేలాల్సి ఉంది. ఈ విషయాన్ని ఐసీసీ, అవినీతి నిరోధక శాఖ విభాగానికి బదిలీ చేసింది. ప్రస్తుతం ఈ సంఘటనపై విచారణ జరుగుతోంది.


టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీలో బంగ్లాదేశ్, సౌతాఫ్రికా రెండు జట్లు కూడా గ్రూప్ ఏలో ఉన్నాయి. సౌతాఫ్రికా ఉమెన్, బంగ్లాదేశ్ ఉమెన్ మధ్య ఫిబ్రవరి 21న కేప్‌ టౌన్ వేదికగా మ్యాచ్ జరగనుంది. లీకైన ఫోన్ సంభాషణ ఈ మ్యాచ్‌కి సంబంధించినదా? లేక వేరే మ్యాచ్ గురించా? అనేది తెలియాల్సి ఉంది..

టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీలో తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతుల్లో 3 పరుగుల తేడాతో ఓడింది సౌతాఫ్రికా. బంగ్లాదేశ్ జట్టు, శ్రీలంక చేతిలో 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 65 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది..

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది బంగ్లాదేశ్. ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో సౌతాఫ్రికా ఓ విజయం, ఓ పరాజయం అందుకుని పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా, రెండు మ్యాచుల్లోనూ ఓడిన బంగ్లాదేశ్ నాలుగో స్థానంలో ఉంది...


గ్రూప్ ఏలో ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు టాప్ 2లో ఉండగా గ్రూప్ బీలో ఇంగ్లాండ్, భారత్ రెండేసి మ్యాచుల్లో గెలిచి టాప్ 2లో కొనసాగుతున్నాయి. భారత్ చేతిలో ఓడిన పాకిస్తాన్, రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిచి బోణీ కొట్టింది.వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లు రెండు మ్యాచుల్లోనూ ఉంది ఆఖరి స్థానాల్లో ఉన్నాయి.

ఫిబ్రవరి 21న గ్రూప్ మ్యాచులు ముగుస్తాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 23న మొదటి సెమీ ఫైనల్, ఫిబ్రవరి 24న రెండో సెమీ ఫైనల్ మ్యాచులు జరుగుతాయి. ఫిబ్రవరి 26న జరిగే ఫైనల్‌తో ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీ ముగుస్తుంది..