T20I World Cup 2022: మరో రెండు వారాల్లో మొదలుకాబోయే టీ20 ప్రపంచకప్ సమరానికి ముందు దక్షిణాఫ్రికాకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్ రౌండర్ గాయం కారణంగా  వరల్డ్ కప్ కు దూరమయ్యాడు. 

ఈనెల 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కాబోయే టీ20 ప్రపంచకప్ సమరానికి ముందే దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్ రౌండర్, ఇటీవలే భారత్‌తో ముగిసిన మూడో మ్యాచ్ లో కీలక వికెట్లు తీసి మ్యాచ్ విన్నర్ గా నిలిచిన డ్వేన్ ప్రిటోరియస్ గాయంతో భారత్ తో వన్దే సిరీస్ తో పాటు ప్రపంచకప్ కు కూడా దూరమయ్యాడు. అసలే ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలలో ఏదో విధంగా దురదృష్టం వెంటాడే సఫారీలకు ఇది మరింత ఆందోళన కలిగించేది కావడం గమనార్హం. 

ప్రిటోరియస్ గాయంపై క్రికెట్ సౌతాఫ్రికా స్పందిస్తూ.. ‘ఇండోర్ లో భారత్ తో ముగిసిన మూడో టీ20లో ప్రిటోరియస్ గాయంతో బాధపడ్డాడు. దీంతో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించగా గాయం తిరగబెట్టినట్టు తేలింది. ఫలితంగా అతడు భారత్ తో వన్డే సిరీస్ తో పాటు వచ్చే ప్రపంచకప్ నుంచి కూడా తప్పుకున్నాడు..’ అని తెలిపింది. 

ప్రిటోరియస్ వైదొలగడంతో వన్డే సిరీస్ కు అతడి స్థానంలో మార్కో జాన్సేన్ ను ఎంపిక చేశారు. అయితే ప్రపంచకప్ లో ప్రిటోరియస్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని క్రికెట్ సౌతాఫ్రికా తెలిపింది.

Scroll to load tweet…

ఇప్పటివరకు ఐసీసీ ప్రపంచకప్ నెగ్గని దక్షిణాఫ్రికా.. ఈసారైనా ఆ కలను నెరవేర్చుకోవాలని భావిస్తున్నది. జట్టులో డికాక్, మిల్లర్, మార్క్రమ్ వంటి బ్యాటర్లు అద్భుత ఫామ్ లో ఉండగా హెన్రిచ్ క్లాసెన్, రోసో, హెన్రిక్స్, ట్రిస్టన్ స్టబ్స్ వంటి హిట్టర్లు ఉన్నారు. బౌలింగ్ లో కూడా రబాడా, పార్నెల్, నోర్త్జ్ తో పాటు స్పిన్నర్లు కేశవ్ మహారాజ్, షంషీ లపై సఫారీ జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. బ్యాటింగ్ లో మెరుపులతో పాటు బౌలింగ్ కూడా చేయగలిగే ప్రిటోరియస్ కూడా దక్షిణాఫ్రికా ఎంపిక చేసిన 15 మంది సభ్యులలో ఒకడిగా ఉన్నాడు. కానీ ప్రస్తుతం అతడు తప్పుకోవడంతో రిజర్వ్ ప్లేయర్లుగా ఉన్న బ్రోన్ ఫార్ట్యూన్, మార్కో జాన్సేన్, ఆండిల్ పెహ్లుక్వాయో లలో ఎవరో ఒకరికి అవకాశం దక్కొచ్చు. 

Scroll to load tweet…