బ్రిడ్జ్‌వాటర్‌ సమీపంలోకి రాగానే ఫ్రియర్న్‌ స్ట్రీట్‌లో గ్రీన్‌ డ్రాగన్‌ పబ్‌ వద్ద కొందరు వ్యక్తులు అతనికి అడ్డువచ్చారు. వెంటనే వారంతా ఆయనను చుట్టుముట్టారు.

దక్షిణాఫ్రికా క్రికెటర్ మొండ్లీ ఖుమా ఆస్పత్రి పాలయ్యారు. ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. యూకేలో ఆయనపై ఈ దాడి జరగడం గమనార్హం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. మరో రోజు గడిస్తే తప్ప.. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది చెప్పలేమని వారు చెబుతున్నారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే... సౌతాఫ్రికాకు చెందిన మొండ్లీ ఖుమాలో యూకేలో కౌంటీ క్రికెట్‌ ఆడేందుకు వచ్చాడు. అతను నార్త్‌ పెర్తర్‌టన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా మొండ్లీ ఖుమాలో మే 29(ఆదివారం) మ్యాచ్‌ ముగించుకొని ఇంటికి బయల్దేరాడు. బ్రిడ్జ్‌వాటర్‌ సమీపంలోకి రాగానే ఫ్రియర్న్‌ స్ట్రీట్‌లో గ్రీన్‌ డ్రాగన్‌ పబ్‌ వద్ద కొందరు వ్యక్తులు అతనికి అడ్డువచ్చారు. వెంటనే వారంతా ఆయనను చుట్టుముట్టారు. వారంతా తనను ఎందుకు చుట్టుముట్టారో కూడా ఆయనకు అర్థం కాలేదు.

తేరుకొని.. తనను ఎందుకు అడ్డుకున్నారు అని అడిగేలోపే ఖుమాలోపై దాడికి పాల్పడ్డారు. అతన్ని విచక్షణారహితంగా కొట్టిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో తీవ్ర గాయాలపాలైన మొండ్లీ ఖుమాలోను అక్కడి స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దెబ్బలు బాగా తగలడంతో ఖుమాలో పరిస్థితి సీరియస్‌గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కాగా ఖుమాలో స్నేహితుడు.. తోటి క్రికెటర్‌ టియాన్ కోకెమోర్ ట్విటర్‌ వేదికగా తన స్నేహితుడు కోలుకోవాలని.. అందుకు మీరంతా ప్రార్థించాలంటూ ట్వీట్‌ చేశాడు.''మనం నీచమైన ప్రపంచంలో బతుకు జీవనం సాగిస్తున్నాం. నా స్నేహితుడు.. జట్టు సభ్యుడు మొండ్లీ ఖుమాలో త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. గత ఆదివారం ఇంటికి వస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని.. ప్రస్తుతం యూకేలోని ఆసుపత్రిలో మృత్యువు నుంచి తప్పించుకోవడానికి పోరాటం చేస్తున్నాడు''. అంటూ పేర్కొన్నాడు.

కాగా విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ఖుమాలోపై దాడికి దిగిన వారిలో ఒక 27 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా ఖుమాలోపై దాడి విషయాన్ని పోలీసులు సౌతాఫ్రికాలో ఉన్న తన కుటుంబసభ్యులకు తెలియజేశారు.