టీమిండియా... ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ జట్టు.  దేశం, జట్టు, ఫార్మాట్ తో సంబంధం లేదు... గెలుపే లక్ష్యంగా కోహ్లీ సేన అదరగొడుతోంది. ఇలా ప్రపంచ కప్ మెగాటోర్నీలోనే కాదు  ఇటీవల జరిగిన వెస్టిండిస్ పర్యటనలో కూడా భారత జట్టు సమిష్టి పోరాటంతో అద్భత విజయాలను అందుకుంది. ఇలా జట్టు జట్టంతా మంచి పామ్ లో వున్న సమయంలో టీమిండియాతో  సౌతాఫ్రికా తలపడనుంది...అదీ మన స్వదేశంలో. 

ప్రస్తుతమున్న భారత జట్టును ఓడించడం అంత సులువైన విషయం కాదు. అందువల్లే గతకొంతకాలంగా ఆ జట్టు ఆటతీరును పరిశీలిస్తూ కట్టడి చేయడానికి వ్యూహాలు రచిస్తున్నట్లు సఫారీ టీం తాత్కాలిక మేనేజర్ ఎనోచ్ తెలిపాడు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని... టీ20 సీరిస్ ఆరంభమయ్యే సెప్టెంబర్ 15నాటికి తమ ఆటగాళ్లను తమ వ్యూహాలతో సంసిద్దం చేస్తామని ఆయన పేర్కొన్నాడు. 

''గత కొంత కాలంగా మేమంతా నిద్రాహారాలు లేకుండా  కష్టపడుతున్నాం. భారత జట్టును వారి స్వదేశంలో ఎలా ఓడించాలన్న ప్రశ్నకు  సమాధానం కోసమే మా ప్రయత్నం. ఇందుకోసం సౌతాఫ్రికా టీం ఆటగాళ్లే కాదు సహాయక సిబ్బంది మంచి సమన్వయంతో ముందుకెళుతోంది. ఈ పరిణామాలు భారత జట్టును సమర్ధవంతంగా  ఎదుర్కోగలమన్న నమ్మకాన్నిస్తోంది. 

ఇటీవల కోహ్లీసేన వెస్టిండిస్  పర్యటనలో ఎలా ఆడిందో ఆసాంతం పరిశీలించాం. ప్రత్యేకంగా కొందరు సిబ్బందికి ఆ పనిని అప్పజెప్పాం. దాంతోపాటు స్వదేశంలో భారత జట్టుకు కలిసొచ్చే అంశాలపై కూడా దృష్టిసారించాం. వీటన్నింటి ఆధారంగానే ప్రణాళికలు రూపొందిస్తున్నాం.'' అని  ఎనోచ్  వెల్లడించాడు.