SA vs WI: సెంచూరీయన్ వేదికగా దక్షిణాఫ్రికా - వెస్టిండీస్ ల మధ్య జరిగిన రెండో టీ20 లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఇరు జట్లూ కలిసి 517 పరుగులు చేశాయి.
‘వీరబాదుడు బాదారు.. దంచి కొట్టారు.. కొట్టుడు అంటే ఇది.. రికార్డులు బద్దలయ్యాయి.. ఇదేం కొట్టుడు బాబోయ్..’ ఈ ఉపమానాలేమీ సరిపోవు. బౌలర్ చేతి నుంచి బంతి విడుదలవ్వడమే పాపం అన్నట్టుగా కుదిరితే ఫోర్ లేకుంటే సిక్సర్.. అంతే ఇంకేం లేదు. బంతి ఎక్కడ వేయాలో తెలియక బౌలర్లు తలలు పట్టుకున్నారు. బాల్ ఎప్పుడైనా కనబడితే చూద్దామని ఫీల్డర్లు కళ్లప్పగించి చూశారు. కానీ స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు మాత్రం ఓవర్ కు రెండు మూడు సార్లు అయినా బంతిని టచ్ చేశారు. 180-200 కూడా టీ20లలో చిన్నవైపోయాయనుకుంటున్న తరుణంలో దక్షిణాఫ్రికా - వెస్టిండీస్ ల మధ్య జరిగిన రెండో టీ20లో రికార్డు స్కోర్లు నమోదయ్యాయి.
సెంచూరీయన్ వేదికగా దక్షిణాఫ్రికా - వెస్టిండీస్ ల మధ్య జరిగిన రెండో టీ20 లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. టీ20లలో ఆ జట్టుకు ఇదే హయ్యస్ట్ స్కోరు.
ఆ జట్టులో చార్లెస్ (46 బంతుల్లో 118, 10 ఫోర్లు, 11 సిక్సర్లు), రొమారియా షెపర్డ్ (18 బంతుల్లో 41 నాటౌట్, 1 ఫోర్, 4 సిక్సర్లు), కైల్ మేయర్స్ (27 బంతుల్లో 51, 5 ఫోర్లు, 4 సిక్సర్లు), రొవ్మన్ పావెల్ (19 బంతుల్లో 28, 1 ఫోర్, 2 సిక్సర్లు) దొరికిన బంతిని దొరికనట్టుగా స్టాడ్స్ లోకి పంపారు. ఆ జట్టులో బ్యాటర్లు కొట్టిన బౌండరీల (17) కంటే సిక్సర్లే (22) ఎక్కువ. విండీస్ బ్యాటర్ల బాదుడుకు సఫారీ బౌలర్లలో రబాడా మినహా పార్నెల్, మార్క్రమ్, జాన్సేన్, మగల, షంషీల ఎకానమీ 10 దాటింది.
సఫారీలూ బాదారు...
కొట్టాల్సింది కొండను. ఎంత అగ్రశ్రేణి జట్టు అయినా ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించడం అంత ఆషామాషీ కాదు. కానీ సఫారీలు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అకీల్ హొసేన్ వేసిన తొలి ఓవర్లోనే క్వింటన్ డికాక్ (44 బంతుల్లో 100, 9 ఫోర్లు, 8 సిక్సర్లు).. ఆ తర్వాత పట్టపగ్గాల్లేకుండా రెచ్చిపోయాడు. కాట్రెల్ వేసిన రెండో ఓవర్లో 6, 6, 6, 4 బాదాడు. అతడితో పాటు రీజా హెండ్రిక్స్ (28 బంతుల్లో 68, 11 ఫోర్లుు, 2 సిక్సర్లు) కూడా తక్కువ తిన్లేదు. హోసేన్ వేసి మూడో ఓవర్లో హెండ్రిక్స్ ఫోర్ కొట్టాడు. నాలుగో బంతికి డికాక్ సిక్సర్ బాదడంతో 16 బంతుల్లోనే సఫారీలు 50 పరుగుల మార్కును చేరారు. హోల్డర్ వేసిన నాలుగో ఓవర్లో హెండ్రిక్స్ నాలుగు బౌండరీలు బాదాడు. ఆరు ఓవర్లకే దక్షిణాఫ్రికా స్కోరు 100 దాటింది. 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 149 పరుగులు చేసింది.
రీఫర్ వేసిన 11వ ఓవర్లో రెండో బంతికి సింగిల్ తీసిన డికాక్.. 42 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. టీ20 ఫార్మాట్ లో అతడికి ఇదే తొలి సెంచరీ. కానీ ఆ మరుసటి బంతికే ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి హెండ్రిక్స్ కూడా పెవిలియన్ చేరినా కెప్టెన్ మార్క్రమ్ (21 బంతుల్లో 38, 4 ఫోర్లు, 1 సిక్స్, హెన్రిచ్ క్లాసెన్ (16 నాటౌట్).. మరో ఏడు బంతులు మిగిలుండగానే దక్షిణాఫ్రికాకు చారిత్రాత్మక విజయాన్ని అందించారు.
- ఈ మ్యాచ్ లో ఇరు జట్లూ కలిసి చేసిన పరుగులు : 517
- టీ20లలో ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్టు సౌతాఫ్రికా మాత్రమే. అంతకుముందు ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ పై 245 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసింది.
