టీమిండియా యువ సంచలనం నవదీప్ సైనీ వెస్టిండిస్ పర్యటనలో అద్భుతంగా రాణించాడు. ఆరంగేట్ర మ్యాచ్ లోనే బంతితో మాయ చేసిన అతడు ఏకంగా నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. ఇలా టీ20 కెరీర్ ఆరంభంలోనే అత్యుత్తమ గణాంకాలను నమోదుచేసిన సైనీపై ప్రశంసల వర్షం కురిసింది. తాజాగా భారత పర్యటనలో వున్న దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ లాన్స్ క్లూసేనర్ కూడా సైనీని పొగడ్తలతో  ముంచెత్తాడు.  

''నేను  గతంలో డిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తో కలిసి పని చేశాను. ఈ సమయంలో సైనీ డిల్లీ టీంలోకి కొత్తగా చేరాడు. అలా జట్టులో చేరిన కొంతకాలానికే అతడి ప్రతిభను నేను గుర్తించాను. ఇతడు తప్పకుండా భారత జట్టులో చోటు దక్కించుకొవడమే కాదు అత్యుత్తమ బౌలర్ గా ఎదుగుతాడని అనుకున్నా. కానీ టీమిండియా సెలెక్టర్లే కాస్త ఆలస్యంగా అతడి ప్రతిభను గుర్తించారు.  

అతడి 150కిమీ ల వేగంతో బౌలింగ్ చేసినా  లైన్ ఆండ్ లెంగ్త్ మిస్సవడు. ఇలాంటి బౌలర్ భారత జట్టులో ఇప్పటివరకు లేడు. కాబట్టి సైనీ టీమిండియాకు దొరికిన అత్యుత్తమ బౌలర్. అతన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటే అద్భుతాలు సృష్టించగలడు. సైనీ గురించి తెలుసు కాబట్టే ఇటీవల వెస్టిండిస్ పర్యటనలో  ప్రదర్శనను చూసి నాకు ఆశ్చర్యమేమీ వేయలేదు.'' అని క్లూసేనర్ పేర్కొన్నాడు. 

వెస్టిండిస్ పర్యటనలో అదరగొట్టడం ద్వారా సైనీ స్వదేశంలో సౌతాఫ్రికాతో తలపడే అవకాశం లభించింది. టీ20 సీరిస్ లో అతడికి చోటు దక్కగా టెస్ట్ సీరిస్ ఆడే అవకాశం లభించలేదు.