భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ నెల 23న బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో గంగూలీ ఈ నెల 24వ తేదీన సెలక్టర్లతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ధోనీ భవిష్యత్తు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

భారత మాజీ కెప్టెన్ ధోనీ గురించి సెలక్టర్ల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత ధోనీతో కూడా మాట్లాడతానని గంగూలీ చెప్పాడు. ఈ సమావేశంలో సెలక్టర్లతో పాటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. కొన్ని నిబంధనల్లో మార్పులతో భారత జట్టు కోచ్ రవిశాస్త్రి అందుబాటులో ఉండకపోవచ్చని దాదా తెలిపాడు.

ఇదిలా ఉండగా... టీం ఇండియా ప్రదర్శన గురించి కూడా గంగూలీ స్పందించారు.  జట్టు ప్రదర్శన బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తూనే... ఐసీసీ టోర్నీలో జట్టు వైఫల్యాలను కూడా ఎత్తి చూపించాడు. ప్రతి టోర్నీ గెలవాలని కోరుకోలేం కానీ.. వరసగా ఏడు టోర్నీల్లో విఫలమవ్వడంపై మాత్రం దృష్టి పెట్టాల్సిందేనని గంగూలీ పేర్కొన్నాడు. మాజీ క్రికెటర్ గా ఎంతో అనుభవం ఉన్న గంగూలీ... బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కచ్చితంగా జట్టును మార్గనిర్దేశం చేస్తాడని నిపుణులు చెబుతున్నారు. ప్రతి మ్యాచ్ పైనా, ఆటగాడి ఆటపైన కూడా సమీక్షలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

సమీక్షలు నిర్వహించినప్పుడు... ఆటగాళ్లు తమ అత్యుతమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘‘ ఇండియా మెగురైన జట్టు.  పెద్ద టోర్నీ గెలిచి టీం ఇండియాకు చాలా సంవత్సరాలు అయ్యిందని నాకు తెలుసు. సెమీఫైనల్స్, ఫైనల్స్ తప్పించి.. మిగిలిన మ్యాచులు బాగా ఆడారు. వీటిపై కెప్టెన్ కోహ్లీ తగిన శ్రద్ధ తీసుకొని పరిస్థితిని మార్చాలి’’ అని గంగూలీ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.