సొంత మైదానాల్లో మ్యాచులు ఆడబోతున్న 10 జట్లు... అండర్ 15 గర్ల్స్ వన్డే టోర్నమెంట్‌ని ప్రవేశపెట్టిన బీసీసీఐ.. 

కరోనా వైరస్ కారణంగా జనజీవన విధానమే కాదు, క్రికెట్‌ ఫ్యాన్స్‌కి ఎంతో ఇష్టమైన ఐపీఎల్‌ పూర్తిగా మారిపోయింది. ఛీర్ గర్ల్స్ లేకుండా, స్టేడియంలో సరిగ్గా జనాలు లేకుండా 2020, 2021 సీజన్ నడిచింది. 2020లో కరోనా వైరస్‌తో ప్రపంచమంతా వణికిపోతున్నప్పుడు యూఏఈ వేదికగా ఐపీఎల్‌ని నిర్వహించి సూపర్ సక్సెస్ సాధించింది బీసీసీఐ. 2021 కరోనా బ్రేక్ కారణంగా రెండు ఫేజ్‌లు ఇక్కడ, అక్కడా జరగగా... 2022 సీజన్‌ను ముంబై, పూణే, కోల్‌కత్తా, అహ్మదాబాద్ నగరాల్లో నిర్వహించింది భారత క్రికెట్ బోర్డు...

అయితే ఇకపై ఐపీఎల్ మళ్లీ పాత పద్దతిలో నిర్వహించబోతున్నట్టు ప్రకటించాడు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ. ‘ఐపీఎల్ 2022 మళ్లీ హోమ్ గ్రౌండ్, బయటి గ్రౌండ్ ఫార్మాట్‌లో జరుగుతుంది. 10 జట్లు కూడా తమ సొంత మైదానాల్లో మ్యాచులు ఆడతాయి. ఇది ఐపీఎల్ ఫ్యాన్స్‌కి సంతోషాన్ని ఇస్తుందని అనుకుంటా... ’ అంటూ ప్రకటించాడు గంగూలీ...

ఐపీఎల్‌ 10 నగరాల్లో నిర్వహిస్తే, స్టేడియానికి వచ్చి మ్యాచులు చూసే ప్రేక్షకుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇది బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంఛైజీలతో పాటు ఆయా రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు లాభాలను తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా తటస్థ వేదికలపై నిర్వహించిన ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ వంటి భారీ ఫాలోయింగ్ ఉన్న జట్లు ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. సొంత మైదానాల్లో ఈ జట్లకు ఉండే ఫాలోయింగ్ చాలా ఎక్కువ...

దీంతో వచ్చే సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచులను చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో, బెంగళూరు మ్యాచులను చిన్నస్వామి స్టేడియంలో, ముంబై మ్యాచ్‌లను వాంఖడే స్టేడియంలో చూడబోతున్నారు అభిమానులు. అలాగే తొలి సీజన్‌లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన గుజరాత్ టైటిన్స్, వచ్చే ఐపీఎల్ 2022లో మొతేరాలోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో మ్యాచులు ఆడనుంది...

అలాగే ఎన్నో రోజులుగా నడుస్తున్న వుమెన్స్ ఐపీఎల్ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు గంగూలీ. ‘వుమెన్స్ ఐపీఎల్‌ని ఎప్పుడు, ఎక్కడ ప్రారంభించాలనేదాని గురించి చర్చిస్తున్నాం. వచ్చే ఏడాది వుమెన్స్ ఐపీఎల్ మొదటి సీజన్ ఉండే అవకాశం అయితే ఉంది... ’ అంటూ ప్రకటించిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, గర్ల్స్ అండర్ 15 వన్డే టోర్నమెంట్‌ని ప్రారంభిస్తున్నట్టు తెలియచేశాడు..

‘అమ్మాయిల అండర్ 15 వన్డే టోర్నమెంట్‌ని ఈ సీజన్‌ నుంచి తీసుకురావడం సంతోషంగా ఉంది. ప్రపంచంలో మహిళల క్రికెట్‌కి మంచి ఆదరణ దక్కుతోంది. మన భారత మహిళల జట్టు కూడా అద్భుతంగా రాణిస్తోంది. కామన్వెల్త్‌లో వాళ్లు సాధించిన పతకం దేశానికే గర్వకారణం. జాతీయ, అంతర్జాతీయ జట్లకు ఆడాలనుకునే అమ్మాయిలకు ఈ అండర్ 15 టోర్నీ తొలి మెట్టుగా ఉపయోగపడుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు సౌరవ్ గంగూలీ...

ఈ ఏడాది డిసెంబర్ 26 నుంచి జనవరి 12 , 2023 వరకూ మొట్టమొదటి అండర్ 15 వుమెన్స్ క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. దేశంలోని బెంగళూరు, రాంఛీ, రాజ్‌కోట్, ఇండోర్, రాయ్‌పూర్, పూణే నగరాల్లో ఈ టోర్నీ జరగనుంది.