Asianet News TeluguAsianet News Telugu

BCCI: గంగూలీ, షా లకు ఓకే.. సుప్రీం తీర్పుతో తొలిగిన అడ్డంకి.. బీసీసీఐలో మళ్లీ వాళ్లదే రాజ్యం..!

BCCI - Supreme Court: బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షాలకు అడ్డంకి తొలిగిపోయింది. రాబోయే మూడేండ్లకు కూడా బీసీసీఐ లో ఈ ద్వయమే చక్రం తిప్పనుంది. 
 

Sourav Ganguly and Jay Shah retain Their Posts After Supreme Court allows in BCCI Amendments
Author
First Published Sep 14, 2022, 7:02 PM IST

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)  రాజ్యాంగంలో సవరణలు కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.  బీసీసీఐ సవరణలను అత్యున్నత న్యాయస్థానం ఆమోదించింది.  బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా ల పదవీకాలంపై నెలకొన్న సస్పెన్స్   వీగిపోయింది.  తాజా తీర్పుతో ఈ ఇద్దరూ మళ్లీ వారి పదవులను  చేపట్టే అవకాశం సుప్రీంకోర్టు  బీసీసీఐ రాజ్యంగం ద్వారా కల్పించింది.  సవరణలలో కీలకమైక ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ను  తొలగిస్తూ బీసీసీఐ చేసిన సవరణకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది. 

బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం  ఏ ఆఫీస్ బేరర్ అయినా  రెండుసార్లు వరుసగా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లలో గానీ బీసీసీఐ లో గానీ పని చేస్తే సదరు వ్యక్తి మూడోసారి పదవి చేపట్టేందుకు అనుమతి లేదు. మళ్లీ మూడేండ్ల తర్వాతే ఆ అవకాశం లభిస్తుంది. ఈ నిబంధన అమల్లో ఉంటే గంగూలీ, జై షా పదవులకు ఎసరొచ్చినట్టే. 

కానీ 2019 డిసెంబర్ లో బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో కీలక ప్రతిపాదనలు చేశారు. ఈ ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ను తొలగించాలని రాజ్యాంగానికి సవరణలు చేశారు.  అయితే ఈ సవరణలకు సుప్రీంకోర్టు అనుమతి తీసుకోవాల్సి రావడంతో  2020 ఏప్రిల్ లో  బీసీసీఐ.. కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.   కూలింగ్ ఆఫ్ పీరియడ్ తో పాటు 70 ఏండ్ల వయో పరిమితిని కూడా ఎత్తేయాలని  బీసీసీఐ తన ప్రతిపాదనల్లో కోరింది.

 

 బీసీసీఐ దాఖలుచేసిన ఈ పిటిషన్ పై మధ్యలో  కరోనా కారణంగా రెండేండ్లు అంతగా పట్టించుకోని సుప్రీంకోర్టు రెండు నెలల క్రితం మళ్లీ దానిని పట్టాలెక్కించింది. పలు విచారణల తర్వాత నేడు కీలక తీర్పు వెల్లువరించింది.   ఈ తీర్పు  ప్రస్తుత పాలకమండలి అధినేతలు గంగూలీ, షా లకు అనుకూలంగా రావడం విశేషం.  దీంతో వాళ్లు పదవీకాలాన్ని మరో మూడేండ్ల పాటు పొడిగించుకోవచ్చు. 

గంగూలీ.. 2019 అక్టోబర్ లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన విషయం తెలిసిందే. బీసీసీఐలోకి రాకముందు దాదా.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడిగా పనిచేశాడు. వాస్తవానికి  ఈ ఏడాది అక్టోబర్ తో గంగూలీ పదవీకాలం  ముగియనుంది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు దాదాకు అనుకూలంగా రావడం గమనార్హం.  దాదాతో పాటు జై షా పదవీకాలం కూడా  ఈ అక్టోబర్ తోనే ముగియాల్సి ఉంది.  బీసీసీఐలోకి రాకముందు జై షా.. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ లో ఆఫీస్ బేరర్ గా వ్యవహరించాడు. ఒకవేళ కోర్టు తీర్పు ఏమాత్రం తేడా కొట్టినా వీళ్లిద్దరూ  వచ్చే నెలతో బ్యాగ్ సర్దుకునేవారే. కానీ ఇప్పుడు మళ్లీ వీళ్లే బీసీసీఐలో చక్రం తిప్పనున్నారు. అయితే ఈ తీర్పుపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు కావడం వల్లే జై షా కు, బీజేపీ కనుసన్నల్లో ఉన్నందుకు గంగూలీకి అనుకూలంగా సుప్రీం తీర్పు వచ్చిందని పలువురు కామంట్స్ చేస్తున్నారు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios