Asianet News TeluguAsianet News Telugu

టీమిండియాకి ఆడేందుకు బీబీఎల్ నుంచి తప్పుకున్న స్మృతి మంధాన... రాహుల్, రోహిత్ ఇలా చేయగలరా...

టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సంచలన నిర్ణయం... టీమిండియాకి పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉండేందుకు బీబీఎల్ నుంచి తప్పుకోవాలని...

 

Smriti Mandhana thinking to pulling out of WBBL to available for Team India
Author
First Published Sep 15, 2022, 4:26 PM IST

భారత మహిళా క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, వుమెన్స్ బీబీఎల్ (బిగ్‌బాష్ లీగ్) నుంచి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. కొంతకాలంగా మహిళా టీమ్ కూడా వరుసగా మ్యాచులు ఆడుతూ బిజీ బిజీగా గడుపుతోంది. దీంతో వర్క్‌లోడ్ తగ్గించుకుని, భారత జట్టుకి అందుబాటులో ఉండేందుకే బిగ్ బాష్ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది స్మృతి మంధాన...

ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ టూర్‌లో ఉంది. తొలి టీ20 మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ వుమెన్స్ చేతుల్లో ఓడిన భారత మహిళా జట్టు, రెండో టీ20లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుని సిరీస్‌ని సమం చేసింది. రెండో టీ20లో 143 పరుగుల లక్ష్యఛేదనలో 53 బంతుల్లో 13 ఫోర్లతో 79 పరుగులు చేసిన స్మృతి మంధాన... భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి... ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకుంది.

టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొంటుంది భారత మహిళా జట్టు. ఇంగ్లాండ్ టూర్ సెప్టెంబర్ 24న ముగుస్తుంటే అక్టోబర్ 13 నుంచి వుమెన్స్ బీబీఎల్ 2022-23 సీజన్ ప్రారంభం కానుంది...

వుమెన్స్ బీబీఎల్‌లో సిడ్నీ థండర్స్ తరుపున ఆడే స్మృతి మంధాన, ఫిట్‌నెస్ కారణంగా ఈ టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ‘ఆటకు మానసికంగా కంటే శారీరకంగా సిద్ధంగా ఉండడం చాలా అవసరం. భారత జట్టుకి ఆడే ఏ మ్యాచ్‌నీ మిస్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే బీబీఎల్ నుంచి తప్పుకోవాలని ఆలోచిస్తున్నా. అంతర్జాతీయ మ్యాచులు ఆడేటప్పుడు 100 శాతం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. గాయాలతో అది సాధ్యం కాదు. అందుకే బీబీఎల్‌ ఆడాలా? వద్దా? అనే విషయం గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు...’ అంటూ కామెంట్ చేసింది స్మృతి మంధాన...

స్మృతి మంధాన కామెంట్లతో భారత పురుష క్రికెటర్ల గురించి చర్చ జరుగుతోంది. క్రికెట్‌లో ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. బిజీ షెడ్యూల్ కారణంగా భారత పురుషుల జట్టులో కీ ప్లేయర్లు తరుచూ గాయపడుతున్నారు. బుమ్రా, హర్షల్ పటేల్ లేకుండానే ఆసియా కప్ 2022 టోర్నీ ఆడిన భారత జట్టు, రవీంద్ర జడేజా లేకుండా టీ20 వరల్డ్ కప్ ఆడబోతోంది. ఫిట్‌నెస్ సమస్యలు, లేదా వర్క్‌లోడ్ అంటూ టీమిండియా ఆడే మ్యాచులకు దూరమైన స్టార్ ప్లేయర్లు ఎవ్వరూ కూడా ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా రెస్ట్ తీసుకోవడానికి ఆసక్తి చూపించలేదు...

ఐపీఎల్ 2020 సీజన్‌లో గాయం నుంచి పూర్తిగా కోలుకోకముందే మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, గాయం తిరగబెట్టడంతో టీమ్‌తో కలిసి ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లలేకపోయాడు. స్వదేశానికి వచ్చి, ఎన్‌సీఏలో శిక్షణ తీసుకుని ఆలస్యంగా ఆస్ట్రేలియాకి వెళ్లాడు. గాయం కారణంగా టీ20, వన్డే సిరీస్‌లకు దూరమైన రోహిత్ శర్మ, ఆఖరి రెండు టెస్టులకు మాత్రమే అందుబాటులో ఉన్నాడు..

కెఎల్ రాహుల్ కూడా ఐపీఎల్‌లో అన్ని మ్యాచులు ఆడడానికి సిద్ధంగా ఉంటాడు. ఐపీఎల్ 2022లో 15 మ్యాచులు ఆడి 616 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, ఆ తర్వాత గాయం కారణంగా రెండు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు...

స్మృతి మంధానలా డబ్బులకు ప్రాధాన్యం ఇవ్వకుండా టీమిండియాకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మీరెప్పుడైనా ఐపీఎల్ నుంచి తప్పుకున్నారా? అంటూ ప్రశ్నిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు అభిమానులు. వీళ్లే కాదు, కోట్లు తెచ్చిపెట్టే ఐపీఎల్ నుంచి తప్పుకోవడానికి ఏ భారత క్రికెటర్ కూడా సిద్ధంగా ఉండడనే విషయం అందరికీ తెలుసు. దీంతో బీబీఎల్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్న  స్మృతి మంధానపై ప్రశంసల వర్షం కురుస్తోంది... 

Follow Us:
Download App:
  • android
  • ios