Asianet News TeluguAsianet News Telugu

స్మృతి మంధాన సెంచరీ మిస్... తొలి వన్డేలో ఇంగ్లాండ్‌పై టీమిండియా ఘన విజయం...

మొదటి వన్డేలో ఇంగ్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం... 91 పరుగులు చేసి అవుటైన స్మృతి మంధాన...

Smriti Mandhana Sensational innings helped team India to beat England in 1st ODI
Author
First Published Sep 19, 2022, 9:56 AM IST

ఇంగ్లాండ్ టూర్‌లో టీ20 సిరీస్‌ని 2-1 తేడాతో కోల్పోయిన భారత మహిళా జట్టు, వన్డే సిరీస్‌ని ఘన విజయంతో ఆరంభించింది. భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సెన్సేషనల్ ఇన్నింగ్స్‌తో టీమిండియా 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ వుమెన్స్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. ఎమ్మా లంబ్ 12 పరుగులు చేయగా టమ్మీ బెమోంట్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యింది. 

డంక్లే 52 బంతుల్లో 3 ఫోర్లతో 29 పరుగులు చేయగా అలీస్ కాప్సే 28 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసింది. డానిల్లీ వ్యాట్ 50 బంతుల్లో 3 ఫోర్లతో 43 పరుగులు చేయగా కెప్టెన్ అమీ జోన్స్ 3 పరుగులు మాత్రమే చేసి రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. 

33 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసిన సోఫీ ఎక్లేస్టోన్‌ని దీప్తి శర్మ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసింది. డేవిడ్సన్ రిచర్డ్స్ 61 బంతుల్లో 4 ఫోర్లతో 50 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో నాటౌట్‌గా నిలవగా చార్లోట్ డీన్ 21 బంతుల్లో 2 ఫోర్లతో 24 పరుగులు చేసింది. తన కెరీర్‌లో ఆఖరి సిరీస్ ఆడుతున్న భారత సీనియర్ పేసర్ జులన్ గోస్వామి 10 ఓవర్లలో 2 మెయిడిన్లతో 20 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టింది...

మేఘనా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్‌లకు తలా ఓ వికెట్ దక్కగా దీప్తి శర్మ 10 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 33 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది..

228 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియాకి శుభారంభం దక్కలేదు. 6 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసిన యంగ్ ఓపెనర్ షెఫాలీ వర్మని కేట్ క్రాస్ అవుట్ చేసింది. 3 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. యాషికా భాటియాతో కలిసి రెండో వికెట్‌కి 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన...

47 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులు పూర్తి చేసుకున్న వికెట్ కీపర్ యషికా భాటియాని చార్లోట్ డీన్ క్లీన్ బౌల్డ్ చేసింది. 99 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది భారత మహిళా జట్టు. అయితే కెప్టెన్ హర్మన్‌‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన కలిసి మూడో వికెట్‌కి 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...

99 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 91 పరుగులు చేసిన స్మృతి మంధాన... సెంచరీకి 9 పరుగుల దూరంలో అవుటై పెవిలియన్ చేరింది. కేట్ క్రాస్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన స్మృతి మంధాన, డేవిడ్సన్ రిచర్డ్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది. 

94 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 74 పరుగులు చేసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, హర్లీన్ డియోల్ 6 పరుగులు చేసి టీమిండియాకి ఘన విజయాన్ని అందించారు. 44.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు, మూడు వన్డేల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యం సాధించింది. ఇరుజట్ల మధ్య సెప్టెంబర్ 21 బుధవారం రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 24న లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ఆఖరి వన్డే మ్యాచ్ ఆడతాయి ఇండియా, ఇంగ్లాండ్... 

Follow Us:
Download App:
  • android
  • ios