ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) కాంట్రాక్టుల కోసం ఆస్ట్రేలియా సహా ఇతర దేశాల క్రికెటర్లు కోహ్లిసేనతో వినయంగా ఉంటున్నారని, ఆరు వారాల్లో రూ. కోట్లు సంపాదించేందుకు వెంపర్లాడుతున్నారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకల్‌ క్లార్క్‌ ఇటీవల తీవ్ర విమర్శ చేసిన సంగతి తెలిసిందే. 

మైఖేల్ క్లార్క్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆస్ట్రేలియా ఆటగాళ్ల నుంచి మొదలు ప్రపంచ క్రికెటర్లు, మాజీలు తదితరులు క్లార్క్ అనుచిత వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. 

ఐపీఎల్‌ కోసం విరాట్‌తో ఎవరైనా స్నేహంగా మెలిగారని అనుకోవట్లేదని ఆసీస్‌ టెస్టు కెప్టెన్‌ టిమ్‌ పెయిన్ ఇప్పటికే కౌంటర్‌ ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా క్లార్క్‌కు భారత మాజీ క్రికెటర్ల నుంచి గట్టి పంచ్‌ తగిలింది. 

వినయం, విధేయత ఐపీఎల్‌లో చోటు సంపాదించి పెట్టలేవని, క్రికెటింగ్‌ నైపుణ్యంతోనే అది సాధ్యపడుతుందని వీవీఎస్‌ లక్ష్మణ్‌, కృష్ణమాచారి శ్రీకాంత్‌ బదులిచ్చారు.  కేవలం కొంతమంది క్రికెటర్లతో స్నేహంతో ఉండటంతో ఐపీఎల్‌ కాంట్రాక్టు దక్కదని,  ఏ ప్రాంఛైజీ అయినా ఆటగాడి సత్తాను చూసిమాత్రమే జట్టులోకి తీసుకుంటారని అన్నాడు లక్ష్మణ్. 

జట్టులో సదరు ఆటగాడి అవసరం బేరీజు వేసుకుని, ప్రణాళికలకు తగ్గట్టు ఫలితాలు సాధించేందుకు సదరు ఆటగాడు ఉపయుక్తం అవుతాడనుకుంటే మాత్రమే వేలంలో ఎంచుకుంటారు తప్ప వినయవిధేయతలతో ఒరిగేదేమీలేదని లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు. 

కేవలం స్నేహ సంబంధాలతో ఐపీఎల్‌ కాంట్రాక్టు ఎవరకీ లభించదని వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు. ఇక మరో దిగ్గజ ఆటగాడు, భారత మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ చిక్కా అసలు ఆస్ట్రేలియన్ల కు స్లెడ్జింగ్ చేస్తే గెలుస్తామనుకునే తప్పుడు అభిప్రాయముందంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. 

మాటల యుద్ధంతో మ్యాచులను నెగ్గలేమని, ఆస్ట్రేలియా బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌ ఓటమి తరువాతయినా తెలుసుకోనుండాల్సింది అని పంచ్ వేశారు. ఇప్పుడు క్లార్క్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదం అని, వివ్‌ రిచర్డ్స్‌, నాసర్‌ హుస్సేన్‌ వంటి అనుభవం కలిగిన క్రికెటర్లను అడిగి తెలుసుకోవాలని, మాటల యుద్ధంతో పరుగులు చేయటం గానీ, వికెట్లు తీయటం కాని ఎప్పటికి జరుగదని చిక్కా అన్నాడు. 

వికెట్ల కోసం క్రమశిక్షణతో బౌలింగ్‌ చేయాలని, పరుగుల వేటలో పట్టుదల చూపించాలని అప్పుడు మాత్రమే మ్యాచులను నెగ్గుతామని, స్టెడ్జింగ్‌ ఎందుకు పనికిరాదని తన అభిప్రాయమని కృష్ణమాచారి శ్రీకాంత్‌ అన్నారు.