Asianet News TeluguAsianet News Telugu

SL Vs WI: ఓటమి అంచున విండీస్.. విజయానికి నాలుగు వికెట్ల దూరంలో లంక..

Srilanka Vs West Indies: శ్రీలంకతో గాలె వేదికగా  జరుగుతున్న తొలి టెస్టులో విండీస్ అపజయం అంచును కొట్టుమిట్టాడుతున్నది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప విండీస్ ను ఓటమి నుంచి తప్పించడం చాలా కష్టం.  

SL Vs Wi Test: Srilanka 4 wickets Away from Victory as West Indies Trial by 296 runs
Author
Hyderabad, First Published Nov 24, 2021, 6:05 PM IST

శ్రీలంక పర్యటనలో ఉన్న వెస్టిండీస్ ఓటమి అంచున నిలిచింది.  రెండు టెస్టులలో భాగంగా గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో  విండీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది.  తొలి టెస్టులో ఓటమి తప్పించుకోవాలంటే ఆ జట్టు 296 పరుగులు చేయాల్సి ఉంది. మరోవైపు శ్రీలంక విజయానికి నాలుగు వికెట్లు మాత్రమే కావాలి. తొలి ఇన్నింగ్స్ లో 156 పరుగుల ఆధిక్యంతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన  లంకేయులు.. నాలుగు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేశారు. కరేబియన్ల ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. 

తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో, ఆ జట్టు సారథి కరుణరత్నే.. (104 బంతుల్లో 83) తో కలిసి మాథ్యూస్ (69  నాటౌట్) గా నిలవడంతో ఆ జట్టు 40.5 ఓవర్లలో 191 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో వచ్చిన ఆధిక్యంతో కలిపి విండీస్ ముందు లంక 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే భారీ లక్ష్య ఛేదనలో వెస్టిండీస్  ఆటగాళ్లు విలవిలలాడారు. 

 

లంక బౌలింగ్ ధాటికి విండీస్.. 18 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ బ్రాత్ వైట్ డకౌట్ అయ్యాడు. 11 ఓవర్లలోపే ఆ జట్టు ఆరు వికెట్లు కోల్పోవడంతో నాలుగో రోజే మ్యాచ్ ముగుస్తుందా..? అనే అనుమానం కలిగింది. 

 

కానీ బోనర్ (47 బంతుల్లో 18 నాటౌట్), వికెట్ కీపర్ జోషువా డ సిల్వా (52 బంతుల్లో 15) తో కలిసి మరో వికెట్ పడకుండా అడ్డుకున్నారు. ఇక లంక బౌలర్లలో రమేశ్ మెండిస్ నిప్పులు చెరిగాడు. 11 ఓవర్లు వేసిన ఆ జట్టు స్పిన్నర్ రమేశ్ మెండిస్.. 4 వికెట్లు పడగొట్టాడు. లసిత్ ఎంబుల్డేనియా రెండు వికెట్లు తీశాడు. 

ఇక ఈ టెస్టులో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప లంక విజయం ఖాయమే. ఐదోరోజు తొలి సెషన్ లోనే విండీస్ తోకను కత్తిరించడం లంక బౌలర్లకు పెద్ద కష్టమేమీ కాదు. ఈ టెస్టులో టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన లంక తొలి ఇన్నింగ్స్ లో 386 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ కరుణరత్నే సెంచరీ (146) చేశాడు. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ 5 వికెట్లు తీయగా  వారికన్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్  లో బ్యాటింగ్ చేసిన విండీస్.. 230 పరుగులకే ఆలౌట్ అయింది. బ్రాత్ వైట్, మేయర్స్, కార్నోవాల్, హోల్డర్ ఆదుకోవడంతో వెస్టిండీస్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 

Follow Us:
Download App:
  • android
  • ios