Srilanka Vs West Indies: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ దారుణ ఓటమి పాలైంది. 348 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన విండీస్.. 160 పరుగులకే ఆలౌట్ అయింది.  

ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ లో సూపర్-12 దశలోనే ఇంటిముఖం పట్టిన శ్రీలంకకు ఓ ఊరట విజయం దక్కింది. స్వదేశంలో వెస్టిండీస్ తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా గాలే లో ముగిసిన తొలి టెస్టులో ఆ జట్టు భారీ విజయం సాధించింది. లంకేయులు నిర్దేశించిన 348 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ 160 పరుగులకే కుప్పకూలింది. 18 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ ను బానర్, డిసిల్వా ఆదుకున్నా వాళ్లిద్దరూ ఓటమి అంతరాన్ని మాత్రమే తప్పించగలిగారు. సిరీస్ లో ఆఖరుదైన రెండో టెస్టు ఇదే వేదికపై ఈనెల 29 నుంచి డిసెంబర్ 3 దాకా జరుగనున్నది. 

52 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఐదో రోజు తొలి సెషన్ ప్రారంభించిన విండీస్ బ్యాటర్లు బానర్ (220 బంతుల్లో 68 నాటౌట్), జోషువా డ సిల్వా (129 బంతుల్లో 54) ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరూ కలిసి లంక బౌలర్లకు పరీక్ష పెట్టారు. ఓవర్ నైట్ స్కోరుకు మరో 66 పరుగులు జోడించిన అనంతరం డ సిల్వా ను ఎంబుల్డెనియా ఔట్ చేయడంతో విండీస్ ఓటమి ఖరారైంది. 

Scroll to load tweet…

జోషువా ఔటైనా బానర్.. కార్న్వాల్ (46 బంతుల్లో 13) కాసేపు ప్రతిఘటించాడు. కానీ లంక బౌలర్లు మిగిలిన తోకను త్వరగానే కత్తిరించారు. కార్న్వాల్ ను జయవిక్రమ పెవిలియన్ కు పంపగా.. వారికన్ ను మెండిస్, గాబ్రియాల్ ను ఎంబుల్డినియా ఔట్ చేశారు. దీంతో 160 పరుగులకు విండీస్ ఆలౌటైంది. లంక బౌలర్లలో ఆ జట్టు స్పిన్నర్ మెండిస్ ఐదు వికెట్లు తీయగా.. లసిత్ ఎంబుల్డెనియా నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో పాటు రెండో ఇన్నింగ్స్ లోకూడా ధాటిగా ఆడిన లంక సారథి కరుణరత్నెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

Scroll to load tweet…

కాగా.. ఈ టెస్టులో టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన లంక తొలి ఇన్నింగ్స్ లో 386 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ కరుణరత్నే సెంచరీ (146) చేశాడు. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ 5 వికెట్లు తీయగా వారికన్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన విండీస్.. 230 పరుగులకే ఆలౌట్ అయింది. బ్రాత్ వైట్, మేయర్స్, కార్నోవాల్, హోల్డర్ ఆదుకోవడంతో వెస్టిండీస్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్ లో లంక 4 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. విండీస్ ముందు 348 పరుగుల లక్ష్యాన్ని నిలిపితే ఆ జట్టు 160 పరుగులకే కుప్పకూలి ఓటమిని మూటగట్టుకున్నది.