SL vs PAK Test: తొలి టెస్టులో నెగ్గామన్న ఆనందం పాకిస్తాన్ కు వారం రోజుల పాటైనా దక్కలేదు.  గాలే వేదికగా ముగిసిన రెండో టెస్టులో పాకిస్తాన్ చిత్తుగా ఓడింది.  లంక దెబ్బకు దెబ్బ తీసింది.  

కొండంత లక్ష్యాన్ని కరిగించే క్రమంలో పాకిస్తాన్ మధ్యలోనే కాడి వదిలేసింది. గాలే వేదికగా ముగిసిన శ్రీలంక-పాకిస్తాన్ రెండో టెస్టులో పర్యాటక జట్టు (పాక్) 246 పరుగుల తేడాతో దారుణ ఓటమిని మూటగట్టుకుంది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ 261 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంక యువ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య అనుకున్నట్టుగానే గాలేలో చివరి రోజు మాయ చేశాడు. ఐదు వికెట్లతో చెలరేగిన అతడు పాకిస్తాన్ బ్యాటింగ్ వెన్ను విరిచాడు. అతడికి తోడు రమేష్ మెండిస్ కూడా నాలుగు వికెట్లతో చెలరేగడంతో పాకిస్తాన్ తలవంచక తప్పలేదు. 

508 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా ఐదో రోజు ఓవర్ నైట్ స్కోరు 89-1 వద్ద ఆట ప్రారంభించిన పాకిస్తాన్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇమామ్ ఉల్ హక్ (49) ను ప్రభాత్ జయసూర్య పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత మహ్మద్ రిజ్వాన్ (37) కలిసి బాబర్ ఆజమ్ (81) నాలుగో వికెట్ కు 79 పరుగులు జోడించాడు. కానీ లంచ్ కు కొద్దిసేపటి ముందు జయసూర్య పాక్ కు మరో షాకిచ్చాడు. రిజ్వాన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 

ఆ వెంటనే ఫవాద్ ఆలం (4) రనౌట్ అయ్యాడు. అఘ సల్మాన్ (4) ను కూడా జయసూర్య పెవిలియన్ కు పంపాడు. లంచ్ తర్వాత టెయిలెండర్లతో బండి లాగిద్దామనుకున్న బాబర్ ఆజమ్ ను జయసూర్య ఎల్బీడబ్ల్యూ ద్వారా ఔట్ చేసి పాక్ ఇన్నింగ్స్ పతనానికి లైన్ క్లీయర్ చేశాడు. ఇక ఆ తర్వాత పాక్ ఇన్నింగ్స్ కథ ముగియడానికి పెద్ద సమయమేమీ పట్టలేదు. యాసిర్ షా (27), నజీమ్ షా (18) కాసేపు మెరుపులు మెరిపించినా అవి పాక్ పరాజయాన్ని మార్చలేదు. 

Scroll to load tweet…

రెండో ఇన్నింగ్స్ లో జయసూర్యకు ఐదు వికెట్లు దక్కగా మరో స్పిన్నర్ రమేష్ మెండిస్ కు నాలుగు వికెట్లు దక్కాయి. ఇక ఈ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి లంకకు భారీ స్కోరు అందించిన ధనుంజయ డిసిల్వకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. సిరీస్ ఆసాంతం రాణించిన ప్రభాత్ జయసూర్యకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. తొొలి టెస్టులో పాకిస్తాన్ నెగ్గగా రెండో టెస్టులో లంక ను విజయం వరించింది. ఫలితంగా సిరీస్ 1-1తొ సమమైంది.

Scroll to load tweet…

సంక్షిప్త స్కోరు వివరాలు :
శ్రీలంక : 378 & 360/8 డిక్లేర్డ్
పాకిస్తాన్ : 231 & 261 
ఫలితం : 264 పరుగుల తేడాతో శ్రీలంక విజయం