IPL Captains Under Pressure: ఓ జట్టుకు సారథి అంటే తాను నడుస్తూ జట్టును నడిపించేవాడు. కానీ మహారాష్ట్ర వేదికగా జరుగుతున్న ఐపీఎల్-2022 లో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు కెప్టెన్లు..
సారథ్యం ఒక నాయకుడికి అదనపు బలం కావాలి గానీ అది బలహీనత కాకూడదు. మిగతా రంగాల సంగతి పక్కనబెడితే ఇది క్రికెట్ లో అయితే దాని పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయి. కెప్టెన్సీ భారమైతే దాని ప్రభావం ఒక్క ఆ ఆటగాడిమీదే కాదు సహచర ప్లేయర్ల ఆట మీద కూడా దారుణంగా పడుతుంది. కెప్టెన్ గా ఉండి తాను రాణిస్తే (బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా)నే జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా స్ఫూర్తి పొందుతారు. వాళ్లు కూడా స్ఫూర్తివంతంగా ఆడతారు. కానీ సారథే విఫలమైతే..? ప్రస్తుతం ఐపీఎల్ లో ఇదే ట్రెండ్ నడుస్తున్నట్టుగా ఉంది. ఒకటి అరా సందర్భాలలో తప్ప పది జట్ల ఫ్రాంచైజీల నాయకులు గొప్పగా రాణించిందైతే లేదు. దానికి వాళ్లు మూల్యం కూడా చెల్లిస్తున్నారు.
ఈ సీజన్ లో ఇప్పటకే 25 మ్యాచులు ముగిశాయి. ‘మా కెప్టెన్ ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించాడు..’ అన్నదైతే ఇప్పటిదాకా లేదంటే అతిశయోక్తి కూడా కాదు. ఇక ఐపీఎల్ లో అత్యధిక పరుగులు సాధించిన టాప్-10 ఆటగాళ్ల జాబితాలో ఒక్క కెప్టెన్ కూడా లేడంటే మన సారథుల వైఫల్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ సీజన్ లో కెప్టెన్ల రిపోర్డు కార్డు ఎలా ఉందంటే..?
1. రోహిత్ శర్మ : ఈ సీజన్ లో ఇప్పటిదాకా ఐదు మ్యాచులాడిన రోహిత్ శర్మ చేసిన పరుగులు 108.. ఈ సీజన్ లో రోహిత్ స్కోర్లు ఇలా ఉన్నాయి. 41, 10, 3, 26, 28.. అత్యధిక స్కోరు 41 (ఢిల్లీపై)
2. రవీంద్ర జడేజా : 2022 సీజన్ కు ముందు సీఎస్కే తరఫున జడ్డూ బ్యాటింగ్ కు దిగాడంటే బంతి స్టాండ్స్ లోనే ఎక్కువుండేది. కానీ ఇప్పుడు అదేంటో గానీ బౌండరీ కూడా టచ్ చేయడం లేదు. ఈ సీజన్ లో మనోడి గత ఐదు ప్రదర్శనలు ఇలా ఉన్నాయి. 26, 17, 0, 23, 0.. అత్యధిక స్కోరు 26 నాటౌట్. (బౌలింగ్ లో ఐదు మ్యాచుల్లో నాలుగు వికెట్లు తీశాడు).
3. రిషభ్ పంత్ : ఢిల్లీ సారథి రిషభ్ పంత్ అడపాదడపా రాణిస్తున్న అవి భారీ స్కోర్లైతే కాదు. ఈ సీజన్ లో నాలుగు మ్యాచులాడిన రిషభ్ స్కోర్లు వరుసగా.. 1, 43, 39 నాటౌట్, 27..
4. కేన్ విలియమ్సన్ : సన్ రైజర్స్ సారథి గత రెండు మ్యాచులలో ఫర్వాలేదనపించిన తొలి రెండు మ్యాచులలో అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. కేన్ మామ స్కోర్లు వరుసగా.. 2, 16, 32, 57 గా ఉన్నాయి. వీటిని సాధించడానికి కూడా కేన్ మామా చాలా శ్రమించాల్సి వచ్చింది.
5. మయాంక్ అగర్వాల్ : ఈ సీజన్ లో పంజాబ్ కు సారథిగా వ్యవహరిస్తున్న మయాంక్ ముంబై తో మ్యాచ్ కు ముందు స్కోర్లు వరుసగా.. 32, 1, 4, 5, 52 గా ఉన్నాయి. ముంబై తో మ్యాచ్ లోనే అతడు కాస్త బ్యాట్ ఝుళిపించాడు.
6. శ్రేయస్ అయ్యర్ : గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతూ టన్నుల కొద్దీ పరుగులు చేసిన అయ్యర్ కేకేఆర్ తరఫున మాత్రం ఆ మార్కును ఇంతవరకూ చూపలేదు. గత ఐదు మ్యాచులలో అయ్యర్ స్కోర్లు ఇలా.. 20 నాటౌట్, 13, 26, 10, 54 గా ఉన్నాయి.
7. హార్ధిక్ పాండ్యా : ఐపీఎల్ లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ సారథి హార్ధిక్ మిగతా సారథులతో పోలిస్తే కాస్త బెటర్ గానే ఉన్నాడు. ఈ సీజన్ లో సారథులలో అత్యధిక బ్యాటింగ్ యావరేజీ (40 ప్లస్) ఉన్న కెప్టెన్ పాండ్యానే. మిగిలినవారందరిదీ 35 కంటే తక్కువే ఉంది. ఇక గత నాలుగు మ్యాచుల్లో పాండ్యా స్కోర్లు.. 33, 31, 27, 50 నాటౌట్ గా ఉన్నాయి.
8. కెఎల్ రాహుల్ : గతంలో పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా ఉంటున్నా పరుగుల వరద పారించిన రాహుల్ ఇప్పుడు ఆ మ్యాజిక్ చూపడం లేదు. ఒక్క సన్ రైజర్స్ మ్యాచ్ లో తప్ప అతడు పెద్దగా రాణించింది లేదు. గత ఐదు ఇన్నింగ్స్ లలో రాహుల్ స్కోర్లు.. 0, 40, 68, 24, 0..
9. సంజూ శాంసన్ : తొలి మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో ఫర్వాలేదనిపించిన రాజస్తాన్ సారథి శాంసన్ తర్వాత మూడు మ్యాచుల్లో పెద్దగా ఆకట్టుకోలేదు. అతడి గత నాలుగు ఇన్నింగ్స్ స్కోర్లు.. 55, 30, 8, 13
10. ఫాఫ్ డుప్లెసిస్ : బెంగళూరు సారథిగా పంజాబ్ తో ఆడిన తొలి మ్యాచ్ లోనే 88 పరుగుల తో వీర విహారం చేసిన డుప్లెసిస్.. తర్వాత మ్యాచ్ లలో మాత్రం విఫలమవుతున్నాడు. గత ఐదు ఇన్నింగ్స్ లలో అతడి స్కోర్లు.. 88, 5, 29, 16, 8.. గా ఉన్నాయి.
