క్లీన్ బౌల్డ్ అయినా బెయిల్స్ కిందపడకపోవడంతో నాటౌట్‌గా తేలిన శ్రేయాస్ అయ్యర్... 90 పరుగుల వద్ద అవుటైన ఛతేశ్వర్ పూజారా...
అన్నీ కరెక్టుగా ఉండి ఉంటే ఈపాటికి టీమిండియా కెప్టెన్ అవ్వాల్సిన వాడు శ్రేయాస్ అయ్యర్. గత ఏడాది ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడి నాలుగు నెలల పాటు క్రికెట్‌కి దూరమైన శ్రేయాస్ అయ్యర్, రీఎంట్రీ తర్వాత వన్డే, టీ20ల్లో తుది జట్టులో చోటు దక్కించుకోవడానికే తెగ కష్టపడుతున్నాడు. అయితే టెస్టుల్లో మాత్రం నిలకడగా రాణిస్తూ తన స్థానాన్ని స్థుస్థిరం చేసుకుంటున్నాడు అయ్యర్...
తాజాగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో లక్ బాగా కలిసి రావడంతో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు శ్రేయాస్ అయ్యర్. కెరీర్‌లో నాలుగో టెస్టు హాఫ్ సెంచరీ అందుకున్న అయ్యర్, ఎబదత్ హుస్సేన్ బౌలింగ్‌లో బంతిని పూర్తిగా మిస్ అయ్యాడు. నేరుగా వెళ్లి వికెట్లను తాకింది బాల్. అయితే గాల్లోకి ఎగిరిన బెయిల్, మళ్లీ వికెట్ల మీదే పడి ఆగిపోయింది.
ఐసీసీ రూల్స్ ప్రకారం బెయిల్ కిందపడకపోవడంతో శ్రేయాస్ అయ్యర్ నాటౌట్‌గా మిగిలాడు. అయితే ఆ తర్వాతి ఓవర్‌లో ఛతేశ్వర్ పూజారా, తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 203 బంతుల్లో 11 ఫోర్లతో 90 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా.. సెంచరీ చేరువులో అవుటై పెవిలియన్ చేరాడు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది టీమిండియా. శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులతో క్రీజులో ఉండగా 14 పరుగులు చేసిన అక్షర్ పటేల్, తొలి రోజు ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు.
48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత జట్టుని రిషబ్ పంత్‌తో పాటు ఛతేశ్వర్ పూజారా, శ్రేయాస్ అయ్యర్ కలిసి ఆదుకున్నారు. రిషబ్ పంత్ 46 పరుగులు చేసి అవుట్ కాగా, ఛతేశ్వర్ పూజారా, శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు... ఐదో వికెట్‌కి 149 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత పూజారా వికెట్ కోల్పోయింది టీమిండియా.
మరో ఎండ్‌లో శ్రేయాస్ అయ్యర్ 163 బంతుల్లో 10 ఫోర్లతో 80 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.
తన స్టైల్‌లో 125 బంతుల్లో టెస్టుల్లో 34వ హాఫ్ సెంచరీ అందుకున్నాడు ఛతేశ్వర్ పూజారా. మరో ఎండ్‌లో శ్రేయాస్ అయ్యర్ కూడా తన స్టైల్‌లో నిలకడైన ప్రదర్శన ఇస్తున్నాడు. 60 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది టీమిండియా. శ్రేయాస్ అయ్యర్ 89 బంతుల్లో 6 ఫోర్లతో 45 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకి శుభారంభం దక్కలేదు. 40 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో యాసిర్ ఆలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా. 54 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసిన కెప్టెన్ కెఎల్ రాహుల్, ఖలీద్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
ఆఖరి వన్డేలో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ... 5 బంతులాడి 1 పరుగుకే అవుట్ అయ్యాడు. తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు విరాట్. డీఆర్‌ఎస్ తీసుకున్నా ఉపయోగం లేకపోయింది.
48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, 45 బంతుల్లో 6 ఫోర్లు,2 సిక్సర్లతో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ కొట్టిన రిషబ్ పంత్, ఆ తర్వాతి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 112 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది భారత జట్టు.. ఈ దశలో రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతూ బంగ్లా బౌలర్లపై కౌంటర్ అటాక్ చేశాడు...
అంతర్జాతీయ క్రికెట్‌లో 4 వేల పరుగులు పూర్తి చేసుకున్న రిషబ్ పంత్, టెస్టుల్లో 50 సిక్సర్ల ఫీట్‌ని అందుకున్నాడు. రోహిత్ శర్మ 51 ఇన్నింగ్స్‌ల్లో 50 టెస్టు సిక్సర్లు బాదగా, రిషబ్ పంత్ 54 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు.
ఓవరాల్‌గా పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీ 46 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించి టాప్‌లో ఉంటే రోహిత్ శర్మ, రిషబ్ పంత్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అయితే బంతుల వారీగా చూసుకుంటే మాత్రం రోహిత్ శర్మ కంటే తక్కువ బంతుల్లో 50 సిక్సర్లు బాదేశాడు రిషబ్ పంత్...
గత 7 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 89 సగటుతో పరుగులు చేశాడు రిషబ్ పంత్. సౌతాఫ్రికా టూర్‌లో 100 చేసి నాటౌట్‌గా నిలిచిన రిషబ్ పంత్, ఆ తర్వాత 96, 39, 50, 146, 57, 46 పరుగులు చేసి మొత్తంగా 534 పరుగులు రాబట్టాడు..
16 పరుగుల వద్ద ఎబదత్ హుస్సేన్ బౌలింగ్‌లో ఛతేశ్వర్ పూజారా ఇచ్చిన క్యాచ్‌ని నురుల్ హసన్ జారవిడిచాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత శ్రేయాస్ అయ్యర్ ఇచ్చిన క్యాచ్‌ని ఎబదత్ హుస్సేన్ నేల పాలు చేశాడు.
