Asianet News TeluguAsianet News Telugu

కెప్టెన్సీ అంటే ఐసీసీ అవార్డులు గెలవడం కాదు.. మరోసారి బాబర్‌పై విరుచుకుపడ్డ రావల్పిండి ఎక్స్‌ప్రెస్

Babar Azam: పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ లక్ష్యంగా విమర్శలు సంధిస్తున్న మాజీ  పేసర్  షోయభ్ అక్తర్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశాడు. కెప్టెన్సీ అంటే అవార్డులు గెలుచుకోవడం కాదని వ్యాఖ్యానించాడు. 

Shoiab Akhtar once Again Takes Dig at  Pakistan Skipper Babar Azam, Says This MSV
Author
First Published Mar 6, 2023, 4:07 PM IST

పాకిస్తాన్ క్రికెట్ జట్టు సారథి బాబర్ ఆజమ్ కు ఇంగ్లీష్ రాదని, అతడికి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని, అందుకే అతడు బ్రాండ్ కాలేకపోయాడని గతంలో వ్యాఖ్యానించి  పెద్ద దుమారం రేపిన  షోయభ్ అక్తర్ తాజాగా మరోసారి అటువంటి వ్యాఖ్యలే చేశాడు. కెప్టెన్సీ అంటే ఐసీసీ అవార్డులు గెలుచుకోవడం కాదని వ్యాఖ్యానించాడు.  బాబర్ కంటే   పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో అదరగొడుతున్న ఆజమ్ ఖాన్  బాగా ఆడుతున్నదని, భవిష్యత్ తో పాకిస్తాన్ కెప్టెన్ అయ్యే లక్షణాలు కూడా అతడిలో ఉన్నాయని చెప్పాడు. 

24 ఏండ్ల ఆజమ్ ఖాన్ దేశవాళీ క్రికెట్ లో దుమ్ము రేపుతున్నాడు. పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ మోయిన్ ఖాన్  కుమారుడు. తండ్రి మాదిరి ఆజమ్ కూడా వికెట్ కీపర్ బ్యాటరే కావడం గమనార్హం. పీఎస్ఎల్ లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరఫున ఆడుతున్న ఆజమ్ ఖాన్  పై అక్తర్ ప్రశంసలు కురిపించాడు. 

ఓ ఛానెల్ లో  చర్చ సందర్భంగా అక్తర్ మాట్లాడుతూ... ‘ఆజమ్ ను చూడగానే చాలా బాధ్యతలు ఉన్న వ్యక్తిగా అనిపించాడు.   ఆటలోనే కాదు అతడు మాట్లాడిన విధానాన్ని చూసి నాకు చాలా ముచ్చటేసింది. తన ప్రదర్శన గురించి  అతడు మాట్లాడిన విధానం అందరినీ ఆకట్టుకుంది.  20 ఏండ్ల క్రితం నేను క్రికెట్ ఆడే రోజుల్లో మీడియా ముందు గానీ ఏదైనా ఇంటర్వ్యూలలో గానీ మాట్లాడేప్పుడు ఏది పడితే అది మాట్లాడేవాడిని.  కానీ ఇప్పుడు అలా కాదు. ఈ రోజుల్లో మీడియాది చాలా కీలక పాత్ర. మనం ఏం చేసినా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నేను ఎవరో ఒకరిని పిన్ పాయింట్ చేసి మాట్లాడటంలేదు. మీడియా ముందు మాట్లాడేప్పుడు   చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.  అతడు (బాబర్ ను ఉద్దేశిస్తూ) కెప్టెన్  కాబట్టి  మీడియాతో మాట్లాడేప్పుడు   ముందూ వెనుక చూసి మాట్లాడాలి..’అని అన్నాడు. 

అనంతరం బాబర్ కు ఐసీసీ అవార్డులు రావడం గురించి  స్పందిస్తూ... ‘వసీం అక్రమ్, వకార్ యూనిస్, షాహిది అఫ్రిది, అబ్దుల్ రజాక్ లు ఆడేప్పుడు  వాళ్లు ‘ఈ గ్రౌండ్, ప్రేక్షకులకు నావాళ్లు. నేను దీనిని నియంత్రించాలి’అనుకునేవాళ్లు. మన ఆట అనేది వాళ్లను నిశ్శబ్ధంగా కూర్చునేలా చేయాలి.  అలా అయితేనే సూపర్ స్టార్ అవుతారు.  అంతేగానీ ఐసీసీ అవార్డులు గెలిచినంత మాత్రానా కాదు. బాబర్ కూడా ఆ బాధ్యత తీసుకోవాలి.  అతడు  షో ను నడిపించే నాయకుడు కావాలి...’అని  సెటైర్లు వేశాడు. 

కాగా గతేడాది స్వదేశంలో  పాకిస్తాన్.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతిలో టెస్టులలో ఓటమి, న్యూజిలాండ్ తో వన్డేలలో ఓటమి, ఆసియా కప్ ఫైనల్స్, టీ20 ప్రపంచకప్ ఫైనల్స్ లో ఓడటంతో బాబర్ ను సారథిగా దించేయాలని డిమాండ్లు వినిపిస్తున్న విషయం విదితమే. అలా డిమాండ్ చేసేవారిలో  అక్తర్ ముందు వరుసలో ఉన్నాడు. బాబర్ ను విమర్శించడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా అక్తర్ వదులుకోవడం లేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios