Asianet News TeluguAsianet News Telugu

‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’కు బ్రేకులు.. బయోపిక్ నుంచి తప్పుకున్న అక్తర్.. సినిమా తీస్తే కేసు పెడతానని హెచ్చరిక

Rawlapinid Express: తన బయోపిక్ ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’ను  గతేడాది  స్వయంగా అక్తరే ట్విటర్ వేదికగా అనౌన్స్  చేశాడు. ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని  అనుకున్నాడు.  కానీ..

Shoaib Akhtar Distances Himself From His Biopic Rawalpindi Express MSV
Author
First Published Jan 22, 2023, 2:16 PM IST

పాకిస్తాన్ మాజీ పేసర్ షోయభ్ అక్తర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.  తన జీవితంపై తెరకెక్కుతున్న  ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’  నుంచి అతడు తప్పుకున్నాడు.  ఈ బయోపిక్  ను అక్తర్ గతేడాది అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.    చిత్రీకరణ కూడా ప్రారంభమైన ఈ సినిమా మేకింగ్ విషయంలో  అక్తర్  కు  నిర్మాతలకు తలెత్తిన అభిప్రాయ బేధాల వల్ల   మాజీ పేసర్ మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. 

తన బయోపిక్ ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’ను  గతేడాది  స్వయంగా అక్తరే ట్విటర్ వేదికగా అనౌన్స్  చేశాడు. ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని  అనుకున్నాడు. ఈ సినిమాకు మహ్మద్ ఫర్హాజ్ ఖాసిర్ డైరక్టర్ గా వ్యవహరిస్తుండగా.. క్యూ ఫిలిమ్  ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్నది.   

తాజాగా అక్తర్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు ట్విటర్ వేదికగా ప్రకటించాడు. అక్తర్ స్పందిస్తూ.. ‘రావల్పిండి  ఎక్స్‌ప్రెస్ బయోపిక్ నుంచి తప్పుకోవడం బాధగా ఉంది. ఇది నా కలల ప్రాజెక్టు. దీనికోసం నేను చాలా శ్రమించాను కానీ  కొద్దినెలలుగా  మేకర్స్ తో అభిప్రాయ బేధాల వల్ల  బయోపిక్  ఆలోచనను విరమించుకుంటున్నా.  ఇందుకు సంబంధించి   నా మేనేజ్మెంట్, లీగల్ టీమ్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోనుంది.  నా అనుమతి లేకుండా ఎవరైనా   ఈ స్టోరీని తెరకెక్కిస్తే మాత్రం  వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్దంగా ఉన్నా..’ అని   ట్వీట్ చేశాడు. 

 

ఈ సినిమా  ఫస్ట్ గ్లింప్స్ ను  అక్తర్ గతేడాది జులై 24న  తన అభిమానులతో పంచుకున్నాడు. ట్విటర్ వేదికగా  దీనిని విడుదల చేస్తూ.. ‘ఈ అందమైన ప్రయాణానికి ప్రారంభం.  నా కథ, నా జీవితానికి సంబంధించి తెరకెక్కబోతున్న నా బయోపిక్ ను అనౌన్స్ చేస్తున్నాను.  సినిమా పేరు ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్-రన్నింగ్ అగేనెస్ట్ ది ఆడ్స్ (అసమానతలకు వ్యతిరేకంగా నా పరుగు) మీరు ఇంతవరకు వెళ్లని రైడ్ కు మీరు వెళ్లనున్నారు. పాకిస్తాన్ క్రీడాకారునికి సంబంధించి తొలి విదేశీ చిత్రం.. వివాదాస్పదంగా అది నీదే.. షోయభ్ అక్తర్’ అని రాసుకొచ్చాడు. కానీ ఈ ప్రాజెక్టు అర్థాంతరంగానే ఆగిపోవడం గమనార్హం. 

1997లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన అక్తర్.. 2011 వరకు ఆడాడు. తన కెరీర్ లో 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20లు ఆడిన అతడు.. టెస్టులలో 178, వన్డేలలో 247, టీ20లలో 19 వికెట్లు పడగొట్టాడు.

 

Follow Us:
Download App:
  • android
  • ios