ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టీం జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో ఇండియా టీం టాప్ ఓపెనర్ శిఖర్ ధావన్ లేరు. ఆయనను జట్టులోకి తీసుకోకపోవడానికి సెలక్షన్ కమిషన్ చీఫ్ చేతన్ శర్మ ఓ వివరణ ఇచ్చారు.
న్యూఢిల్లీ: భారత క్రికెట్ టీం టాప్ ఓపెనర్, దంచికొట్టే శిఖర్ ధావన్ ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో ఆడటం లేదు. టీ20 వరల్డ్ కప్ జట్టులో బీసీసీఐ ఆయనకు స్థానం కల్పించలేదు. టీ20 వరల్డ్ కప్ జట్టు సభ్యులను బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. యూఏఈ, ఒమన్‌లో ఈ ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో ఎంఎస్ ధోనీ జట్టుకు మెంటర్‌గా మార్గదర్శకత్వం వహించనున్నట్టు చెప్పింది. దీంతో క్రికెట్ అభిమానుల మనసు ఉప్పొంగింది. కానీ, ధావన్‌కు చోటు దక్కకపోవడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆయనను టీ20 టీమ్‌కు సెలెక్ట్ చేయడకపోవడంపై సెలక్షన్ కమిటీ చీఫ్ చేతన్ శర్మ ఓ వివరణ ఇచ్చారు.
చేతన్ శర్మ ఇచ్చిన వివరణలోనూ ధావన్‌ను సెలెక్ట్ చేయకపోవడానికి స్పష్టమైన కారణాన్ని పేర్కొనలేదు. కానీ, ధావన్‌ను పూర్తిగానే తీసుకోమనే ఆలోచనే లేదని వివరించారు. ఆయన పేరు పరిశీలనలో ఉన్నదని తెలిపారు.
‘శిఖర్ ధావన్ మాకు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. శ్రీలంక పర్యటనలో ఆయనే జట్టు కెప్టెన్‌గా ఉన్నారు. అయితే, ప్యానెల్ చర్చించిన విషయాలన్నీ మేం వెల్లడించలేం. ఆయన ముఖ్యమైన ఆటగాడు. ఆయన పేరు ఇంకా పరిశీలనలో ఉన్నది. ప్రస్తుత అవసరాల రీత్యా శిఖర్ ధావన్‌కు కొంత విశ్రాంతినిచ్చి ఇతర ప్లేయర్‌లపై దృష్టి సారించాం. అంతేకానీ, ఆయన చాలా ముఖ్యమైన ప్లేయర్. త్వరలోనే ఆయనను వెనక్కి తీసుకుంటాం’ అని సెలక్షన్ కమిషన్ చైర్మన్ చేతన్ శర్మ వివరించారు.
టీ20లలో ధావన్‌కు మంచి రికార్డు ఉన్నది. ఐపీఎల్ 2021లో అత్యధిక పరుగులు సాధించి పర్పుల్ క్యాప్ సాధించిన ధావన్ టీ20 వరల్డ్ కప్‌లో ఆడబోరని అభిమానులు ఊహించలేదు.
ధావన్ వ్యక్తిగత జీవితం ఈ మధ్యే చర్చలోకి వచ్చింది. ఆయన సతీమణి ఆయేషా ముఖర్జీ సోషల్ మీడియాలో విడాకులను ప్రకటించారు. తమ ఎనిమిదేళ్ల వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్ట వెల్లడించారు.
టీ20 వరల్డ్ కప్ టీంలో ముగ్గురు ఓపెనర్లను ఎంపిక చేశామని వివరించారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిశన్‌లు ఓపెనర్లుగా దిగవచ్చు లేదా మిడిలార్డర్‌లోనూ పంపవచ్చనని తెలిపారు. కిశన్ ద్వారా ఈ సౌలభ్యం మనకు చిక్కుతుందని చెప్పారు. ఆయన ఓపెనింగ్ చేయవచ్చని లేదా అవసరమైతే మిడిలార్డర్‌లోనూ దిగవచ్చునని వివరించారు. శ్రీలంకలో ఆయన మిడిలార్డర్‌లో దిగి హాఫ్ సెంచరీ చేశారని గుర్తుచేశారు.
దీనికితోడు ఒక టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తే విరాట్ కోహ్లీని ఓపెనింగ్‌కు పంపవచ్చునని తెలిపారు. కానీ, ఇప్పటికైతే తాము ముగ్గురిని ఓపెనింగ్ కోసం ఎంపిక చేశామన్నారు. విరాట్ కోహ్లీ జట్టుకు ఉన్న గొప్ప సంపద అని, టీ20లలో ఆయన మిడిలార్డర్‌లో దిగి దుమ్ముదులిపిన సందర్భాలు కోకొల్లలని చెప్పారు.
