INDvsNZ ODI: ఇండియా-న్యూజిలాండ్ మధ్య శుక్రవారం ఆక్లాండ్ వేదికగా ముగిసిన తొలి వన్డేలో భారత జట్టు ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ లో రాణించి ప్రత్యర్థి ముందు 300 ప్లస్  టార్గెట్ ను ఉంచగలిగింది. 

వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని న్యూజిలాండ్ తో సిరీస్ తో ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసిన టీమిండియా.. కివీస్ తో తొలి వన్డేలో ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. కానీ బౌలర్లు తొలి 20 ఓవర్లు రాణించినా తర్వాత అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఇదే భారత ఓటమికి కారణమైంది. కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం ధావన్ మాట్లాడుతూ బౌలింగ్ వైఫల్యాల వల్లే ఈ మ్యాచ్ లో ఓడిపోయామని చెప్పాడు. 

ధావన్ మాట్లాడుతూ.. ‘బ్యాటింగ్ పరంగా మేం బాగా ఆడాం. కివీస్ ముందు ఉంచిన లక్ష్యం కూడా మంచిదే. రెండో ఇన్నింగ్స్ లో తొలి 15 ఓవర్లు బంతి బౌలర్లకు అనుకూలించింది. మిగిలిన గ్రౌండ్స్ కంటే ఇది (ఆక్లాండ్ ఈడెన్ పార్క్) కాస్త డిఫరెంట్ గా ఉంది. ఈ మ్యాచ్ లో మేం చాలా వరకు షాట్ బంతులు విసిరాం.. అదే మా కొంపముంచింది. 

ఈ మ్యాచ్ లో టామ్ లాథమ్ మా బౌలర్లు విసిరిన షాట్ బంతులను టార్గెట్ గా చేసుకుని విజృంభించాడు. 40వ ఓవర్లో అతడు వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు. అదే మా నుంచి మ్యాచ్ ను దూరం చేసింది. మ్యాచ్ లో మా వ్యూహాలు సరిగా అమలు కాలేదు. బ్యాటింగ్ పరంగా మాకు పెద్దగా లోపాలేమీ లేవు..’అని వ్యాఖ్యానించాడు.

ఈ మ్యాచ్ లో 307 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ ప్రమాదకర ఫిన్ అలెన్ (22), డెవాన్ కాన్వే (24), డారిల్ మిచెల్ (11) వికెట్లను తొలి 20 ఓవర్ల లోపే కోల్పోయింది. 88-3 గా ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన టామ్ లాథమ్.. 104 బంతుల్లోనే 19 ఫోర్లు, 5 సిక్సర్లతో 145 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతడికి సారథి కేన్ విలియమ్సన్ (98 బంతుల్లో 94 నాటౌట్, 7 ఫోర్లు, 1 సిక్సర్) సహకరించాడు. కేన్ మామ సెంచరీ మిస్ అయినా మ్యాచ్ మాత్రం కివీస్ గెలిచింది. లక్ష్యాన్ని కివీస్.. 47.1 ఓవర్లలోనే ఛేదించింది. 

Scroll to load tweet…

అంతకుముందు భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. భారత జట్టులో కెప్టెన్ ధావన్ (72), శుభమన్ గిల్ (50) లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ (80) రాణించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్.. 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసి భారత స్కోరును 300 మార్క్ దాటించాడు. ఈ మ్యాచ్ లో కివీస్ ను గెలిపించిన టామ్ లాథమ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మూడు వన్డేల సిరీస్ లో ఒక మ్యాచ్ గెలిచిన న్యూజిలాండ్.. సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది. రెండో వన్డే ఆదివారం జరుగనుంది.