ఇటీవల హఠాన్మరణం చెందిన దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ భౌతిక కాయాన్ని ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం ఆస్ట్రేలియాకు తరలించారు. 

లెజెండరీ స్పిన్నర్, దివంగత ఆటగాడు షేన్ వార్న్ పార్థివదేహాన్ని గురువారం ఉదయం ఓ ప్రత్యేక విమానంలో ఆస్ట్రేలియాకు తరలించారు. థాయ్ లాండ్ లోని డాన్ మ్యూంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మెల్ బోర్న్ కు తరలించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. వార్న్ మృతదేహాన్ని ఓ శవపేటికలో ఉంచి దానిమీద ఆస్ట్రేలియా జాతీయ పతాకం చుట్టారని చెప్పారు. కొద్ది రోజుల క్రితం షేన్ వార్న్ తన మిత్రులతో కలిసి థాయ్ లాండ్ లోని కోహ్ సమూయ్ ద్వీపానికి విశ్రాంతా కోసం రాగా.. అక్కడే ఓ విల్లాలో గత శుక్రవారం హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే.

అయితే, అతడు గుండెపోటుతో మరణించి ఉంటాడని అక్కడి అధికారులు పేర్కొన్నారు. మరోవైపు వార్న్ తల్లిదండ్రులు సైతం అతడు ఇటీవల ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పినట్లు చెప్పారు. తాజాగా వచ్చిన పోస్టుమార్టం నివేదికలోనూ అతడు సహజ మరణం చెందాడని, అందులోనూ గుండెపోటే కారణం అయ్యుంటుందని తేలిందన్నారు. కాగా, షేన్ వార్న్ మృతదేహనికి అక్కడి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు మార్చి 30న మెల్ బోర్న్ క్రికెట్ మైదానంలో వార్న్ సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు విక్టోరియా స్టేట్ గవర్నమెంట్ ప్రకటించింది. 

కాగా, బుధవారం ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అంత్యక్రియలకు వేదిక ఖరారైంది. తనకెంతో ఇష్టమైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) లోనే సుమారు లక్ష మంది అభిమానుల మధ్య వార్న్ కు ‘తుది వీడ్కోలు’ ఇవ్వనున్నారని సమాచారం. ఈనెల 30న ఈ కార్యక్రమం నిర్వహించేందుకు విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహకాలు చేస్తున్నది. ఈనెల 4న వార్న్.. థాయ్లాండ్ లోని తన విల్లాలో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఇంకా అతడి పార్థీవ దేహాన్ని థాయ్లాండ్.. ఆసీస్ కు అప్పగించలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం.. వార్న్ కు ఎంతో ఇష్టమైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లోనే అతడి అంత్యక్రియలను నిర్వహిస్తామని విక్టోరియా ప్రభుత్వం తెలిపింది. ఒకరకంగా వార్న్ కు ఇది సొంత గ్రౌండ్ వంటిది. వార్న్ విగ్రహం కూడా ఎంసీజీ బయటే ఉంది. ఆసీస్ అభిమానులంతా వార్న్ కు అక్కడే నివాళి అర్పిస్తున్నారు. 

ఇదే విషయమై విక్టోరియా ప్రభుత్వానికి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. ‘వార్న్ అంత్యక్రియలను నిర్వహించడానికి ప్రపంచంలో ఇంతకంటే (ఎంసీజీ) బెస్ట్ ప్లేస్ మరొకటి లేదని మేము భావిస్తున్నాం. విక్టోరియాతో పాటు ఆసీస్ కు చెందిన వార్న్ అభిమానులంతా ఈనెల 30న అతడికి నివాళి ఘటిస్తారు. అదే రోజు సాయంత్రం సుమారు లక్ష మంది అభిమానుల మధ్య వార్న్ కు తుది వీడ్కోలు పలుకుతాం...’అని తెలిపాడు. 

1969 సెప్టెంబర్ 13న ఆస్ట్రేలియాలోని విక్టోరియా గ్రామంలో జన్మించిన వార్న్.. అండర్-19 విభాగంలో రాణించి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 1992లో సిడ్నీ వేదికగా టీమిండియాతో జరిగిన టెస్టుతో అరంగేట్రం చేశాడు. పదిహేనేళ్ల పాటు క్రికెట్ ప్రపంచాన్ని తన స్పిన్ తో శాసించిన ఈ స్పిన్ మాంత్రికుడు.. 145 టెస్టులలో 708 వికెట్లు తీశాడు. వన్డేలలో 194 మ్యాచులలో 293 వికెట్లు పడగొట్టాడు. రెండు ఫార్మాట్లలో కలిపి వెయ్యి వికెట్లు తీసిన బౌలర్లలో.. లంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ తర్వాత స్థానంలో వార్న్ ఉన్నాడు.