అడుగుపెట్టిన అరగంటకే, టీమ్‌తో కలిసి మళ్లీ ఇంటికి... పాక్ బౌలర్ షానవాజ్ దహానీకి వింత అనుభవం..

హారీస్ రౌఫ్ స్థానంలో ఆసియా కప్ 2023 టోర్నీ ఆడేందుకు కొలంబో చేరుకున్న పాక్ బౌలర్ షానవాజ్ దహానీ...  సూపర్ 4 రౌండ్ నుంచే ఇంటిదారి పట్టిన పాకిస్తాన్.. అరగంటకే టీమ్‌తో కలిసి మళ్లీ స్వదేశానికి.. 

Shahnawaz Dahani gets trolls after Pakistan eliminated from Asia Cup 2023 after his arrival CRA

ఆసియా కప్ 2023 టోర్నీలో పాకిస్తాక్ క్రికెట్ టీమ్ కథ ముగిసింది. గ్రూప్ స్టేజీలో నేపాల్‌ని చిత్తు చేసిన పాకిస్తాన్, టేబుల్ టాపర్‌గా సూపర్ 4 రౌండ్‌లో అడుగుపెట్టింది. సూపర్ 4 స్టేజీలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 228 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది పాకిస్తాన్...

వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు, పాక్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. భారత బ్యాటర్ల బాదుడుకి పాక్ పేసర్లు హారీస్ రౌఫ్, నసీం షా గాయపడి, బ్యాటింగ్‌కి కూడా రాలేదు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ముఖానికి బంతి బలంగా తలగడంతో ఆఘా సల్మాన్ కూడా గాయపడ్డాడు..

ఒకరికి ముగ్గురు ప్లేయర్లు ఒకే మ్యాచ్‌లో గాయపడడంతో, స్టాండ్ బై ప్లేయర్లను జట్టులోకి తీసుకుంది పాకిస్తాన్. నసీం షా స్థానంలో జమాన్ ఖాన్, శ్రీలంకతో మ్యాచ్‌లో ఆడాడు. హారీస్ రౌఫ్‌కి బ్యాకప్‌గా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షానవాజ్ దహానీని శ్రీలంకకు రప్పించింది పాకిస్తాన్ క్రికెట్ టీమ్ మేనేజ్‌మెంట్..

సెప్టెంబర్ 12న పీసీబీ నుంచి పిలుపు అందుకున్న షానవాజ్ దహానీ, సెప్టెంబర్ 13న అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు కొలంబోలో అడుగుపెట్టాడు. తాను కొలంబోలో దిగినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు షానవాజ్ దహానీ..

అయితే రాత్రి 1 గంటలకు శ్రీలంకతో మ్యాచ్‌లో ఓడింది పాకిస్తాన్. ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ సాగిన థ్రిల్లర్‌లో చివరి 2 బంతుల్లో 6 పరుగులను నియంత్రించలేకపోయింది పాకిస్తాన్. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడడంతో పాకిస్తాన్, సూపర్ 4 రౌండ్ నుంచే ఇంటిదారి పట్టింది..

ఈ మ్యాచ్ ఓటమితో పాకిస్తాన్ జట్టు, స్వదేశానికి తిరిగి పయనమైంది. ఆసియా కప్ 2023 టోర్నీ ఫైనల్ ఆడాలని కొలంబోలో అడుగుపెట్టిన షానవాజ్ దహానీ, తన బ్యాగుల జిప్పులు కూడా తీయకుండానే తిరిగి ఇంటికి తిరిగి వెళ్లాడు. దీంతో షానవాజ్ దహానీని, సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

పాకిస్తాన్ కనీసం 12 గంటల తర్వాత  షానవాజ్ దహానీకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసినా... అతనికి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండేది కాదు. పీసీబీకి టికెట్ డబ్బులైనా మిగిలేవని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు..

నసీం షా గాయం నుంచి కోలుకోవడానికి మూడు వారాల సమయం పడుతుందని వైద్యులు తేల్చారు. దీంతో వన్డే వరల్డ్ కప్ 2023 ఆరంభ మ్యాచుల్లో నసీం షా స్థానంలో జమాన్ ఖాన్ లేదా షానవాజ్ దహానీకి చోటు దక్కే అవకాశం ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios