పాక్ ఆన్‌లైన్ హెడ్కోచ్పై స్పందించిన అఫ్రిది.. పీసీబీపై విమర్శలు
Online Coach: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొత్తగా తీసుకొస్తున్న ఆన్‌లైన్ హెడ్‌కోచ్ పై ఆ జట్టు మాజీ సారథి షాహిద్ అఫ్రిది స్పందించాడు. దేశంలో కోచ్ లు లేరా..? అంటూ పీసీబీపై విమర్శలు కురిపించాడు.

అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఆన్‌లైన్ ద్వారా కోచింగ్ సేవలను పొందాలనుకుంటున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే పీసీబీ చీఫ్ నజమ్ సేథీ.. గతంలో పాక్ కు హెడ్ కోచ్ గా వ్యవహరించిన ఆస్ట్రేలియన్ మికీ ఆర్థర్ ను సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై పీసీబీ అధికారిక ప్రకటన చేయకపోయినా ఆర్థర్ నియామకం దాదాపు ఖాయం అయిందని తెలుస్తున్నది.
అయితే పీసీబీ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ లో మాజీ ఆటగాళ్లు లేరా..? ఇక్కడివాళ్లు కోచ్ లు గా పనికిరారా..? పోని విదేశీ కోచ్ ను తీసుకొచ్చినా భౌతికంగా కాకుండా ఆన్‌లైన్ ద్వారా కోచింగ్ ఎలా ఇప్పిస్తారు..? వంటి ప్రశ్నలు సంధిస్తున్నారు.
తాజాగా ఇదే విషయమై పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్, గతంలో ఆ జట్టుకు సారథిగా కూడా చేసిన షాహిద్ అఫ్రిది స్పందించాడు. అఫ్రిది మాట్లాడుతూ... ‘అసలు ఇది ఏ రకమైన కోచింగో నాకైతే అర్థం కావడం లేదు. పీసీబీ ఏం ఆలోచిస్తుంది..? పాకిస్తాన్ క్రికెట్ ను అది ఏం చేయాలనుకుంటుందో కూడా తెలియడం లేదు. ఈ ఫారెన్ కోచ్ లు, ఆన్‌లైన్ కోచింగ్ ఎందుకు..? పాకిస్తాన్ లో కోచ్ లు లేరా..? ఒక జాతీయ జట్టుకు హెడ్‌కోచ్ గా వ్యవహరించే వ్యక్తి ప్రస్తుతం ఎక్కడఉన్నాడు..? అతడు నిజంగా కోచింగ్ చేయగలడా..? లేదా..? అన్నది కూడా పీసీబీ పరిగణనలోకి తీసుకోవాలి. ఈ విషయంలో రాజకీయాలు చేయడం తగదు. వాటిని పక్కనబెట్టి మంచి జట్టును తయారుచేసేందుకు కృషి చేయాలి..’ అని అన్నాడు.
పాకిస్తాన్ క్రికెట్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం పాక్ కు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న సక్లయిన్ ముస్తాక్ కాంట్రాక్ట్ త్వరలోనే ముగియనుంది. అయితే గతంలో ఆ జట్టుకు హెడ్ కోచ్ గా పనిచేసిన ఆస్ట్రేలియాకు చెందిన మికీ ఆర్థర్ తిరిగి పాకిస్తాన్ టీమ్ కు హెడ్ కోచ్ గా రానున్నాడు. భౌతికంగా అతడు టీమ్ తో కలవడు. అంతా ఆన్‌లైనే. మ్యాచ్ కు ముందు, జరుగుతున్నప్పుడు.. ఆటగాళ్లు గానీ టీమ్ మేనేజ్మెంట్ గానీ కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని మికీ ఆర్థర్ చెప్పిన సలహాలను గ్రౌండ్ లో పాటించాలన్నమాట.