పాకిస్థాన్ ఉగ్రవాదుల పురిటగడ్డ అన్న విషయం ప్రపంచానికంతటికి తెలుసు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా అందులో పాకిస్థాన్ హస్తం తప్పకుండా వుంటుంది. ఇలా కేవలం బయటే కాదు ఆ దేశ అంతర్గత భద్రతను ఈ ఉగ్రమూకలు ప్రశ్నార్థకంగా మార్చాయి. దీంతో అంతర్జాతీయ సమాజం పాక్ లో పర్యటించేందుకు జంకుతున్నారు. ఇటీవల శ్రీలంక ఆటగాళ్లు కూడా పాకిస్థాన్ పర్యటనను భద్రతాకారణాలతో వ్యతిరేకించిన విషయం తెలిసిందే. దీంతో పాకిస్థాన్‌    భద్రతపై మరోసారి చర్చ మొదలయ్యింది.

అయితే పాక్ క్రికెటర్లు, మాజీలు కూడా తమ దేశం చాలా సేఫ్ అని పేర్కొంటున్నారు. మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అయితే మరో అడుగు ముందుకేసి దిగ్గజ క్రికెటర్లకు తన ఇంట్లో విందు ఏర్పాటుచేశాడు.  వెస్టిండిస్ దిగ్గజం మైకెల్ హోల్డింగ్ తో పాటు సయ్యద్ అన్వర్ కూడా ఈ  విందులో పాల్గొన్నారు. ఇలా తమ దేశం భద్రతాపరంగా చాలా సేఫ్ గా వుందని అఫ్రిది కేవలం మాటల ద్వారా కాకుండా ప్రాక్టికల్ గా అంతర్జాతీయ సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేశాడు. 

ఈ విందుకు సంబంధించిన ఫోటోలను జతచేస్తూ అఫ్రిది ఓ ట్విట్ చేశాడు. '' మా ఇంట్లో జరిగిన విందులో లెజెండరీ క్రికెటర్ మైకెల్ హోల్డింగ్ పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నా. కరాచీకి హోల్డింగ్ ను ఆహ్వానించి పట్టుబట్టి మరీ అతన్ని రప్పించిన డాక్టార్ కాషిఫ్ కు కృతజ్ఞతలు. అలాగే తన ఆహ్వానాన్ని మన్నించి ఈ విందుకు హాజరైన సయీద్ అన్వర్ కు థ్యాంక్స్. గొప్ప లెజెండరీలను కలవడం చాలా ఆనందంగా వుంది.'' అంటూ అఫ్రిది ఆనందాన్ని పంచుకున్నాడు. 

పాక్ పర్యటనలో తాను చాలా సౌకర్యవంతంగా వున్నట్లు హోల్డింగ్ వెల్లడించారు. ఇప్పటివరకు తనకు ఎలాంటి సమస్య ఎదురవలేదన్నారు. అందువల్ల పాక్ పర్యటనలో విదేశీ క్రికెటర్లకు ఎలాంటి ముప్పు వుండదని భావిస్తున్నా. ఈ విషయాన్ని గుర్తించిన శ్రీలంక బోర్డు తమ ఆటగాళ్లను పాక్ పర్యటనకు పంపించిందన్నారు. ఇది పాక్ క్రికెట్ ను పూర్వవైభవం దిశగా నడిపిస్తుందని ఆశిస్తున్నానని హోల్డింగ్ అభిప్రాయపడ్డారు.