Asianet News TeluguAsianet News Telugu

వాషింగ్టన్ సుందర్‌కి గాయం... లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆ‌ర్‌సీబీ ప్లేయర్ షాబాజ్ అహ్మద్...

గాయంతో జింబాబ్వేతో వన్డే సిరీస్‌కి దూరమైన వాషింగ్టన్ సుందర్... అతని స్థానంలో షాబజ్ అహ్మద్‌కి జట్టులో చోటు...

Shahbaz Ahmed replaces injured Washington Sundar for Zimbabwe series
Author
India, First Published Aug 16, 2022, 1:47 PM IST

జింబాబ్వే వన్డే సిరీస్ ఆరంభానికి ముందు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లోకి సంచలన ఎంట్రీ ఇచ్చిన వాషింగ్టన్ సుందర్, అప్పటి నుంచి వరుస గాయాలతో సతమతమవుతున్నాడు. గాయంతో ఇంగ్లాండ్ టూర్ 2021 నుంచి అర్ధాంతరంగా వచ్చేసిన వాషింగ్టన్ సుందర్, దాదాపు ఏడాదిగా అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉంటూ వస్తున్నాడు...

దేశవాళీ టోర్నీల్లో ఇచ్చిన పర్ఫామెన్స్ కారణంగా జింబాబ్వే టూర్‌కి ఎంపిక చేసిన జట్టులో వాషింగ్టన్ సుందర్‌కి అవకాశం ఇచ్చారు బీసీసీఐ సెలక్టర్లు. అయితే టూర్‌ ఆరంభానికి ముందు వాషింగ్టన్ సుందర్ భుజానికి గాయమైనట్టు తేలడంతో అతన్ని పక్కనబెట్టేసింది టీమిండియా...

వాషింగ్టన్ సుందర్ కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని నిర్ధారణ కావడంతో అతని స్థానంలో ఆర్‌సీబీ యంగ్ స్పిన్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్‌కి పిలుపునిచ్చింది బీసీసీఐ... ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున ఐపీఎల్ ఆరంగ్రేటం చేసిన షాబాజ్ అహ్మద్, 29 మ్యాచుల్లో 13 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 19 ఇన్నింగ్స్‌ల్లో 279 పరుగులు చేశాడు...

లిస్టు ఏ క్రికెట్‌లో 21 మ్యాచులు ఆడి ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీతో 435 పరుగులు చేసిన షాబజ్ అహ్మద్, 39.54 సగటుతో పరుగులు చేశాడు. 18 వికెట్లు తీసిన షాబజ్ అహ్మద్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్...

ఆగస్టు 18 నుంచి మొదలయ్యే వన్డే సిరీస్‌లో మూడు మ్యాచులు కూడా జింబాబ్వేలోని హారారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతాయి. ఆగస్టు 18న తొలి వన్డే, ఆగస్టు 20న రెండో వన్డే, 22న మూడో వన్డే జరుగుతాయి. ఈ మ్యాచులన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30కి ప్రారంభమవుతాయి...

తొలుత ఈ వన్డే సిరీస్‌కి శిఖర్ ధావన్‌ని కెప్టెన్‌గా ప్రకటించింది బీసీసీఐ. అయితే గాయం నుంచి కోలుకున్న కెఎల్ రాహుల్, కరోనా నుంచి బయటపడి పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో అతనికి కెప్టెన్సీ అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న బీసీసీఐ, శిఖర్ ధావన్‌ని వైస్ కెప్టెన్‌గా నియమించింది. జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయపడడంతో లక్కీగా ఆసియా కప్ 2022 జట్టులో చోటు దక్కించుకున్న ఆవేశ్ ఖాన్‌తో పాటు దీపక్ హుడా, కెఎల్ రాహుల్... జింబాబ్వే టూర్ ముగిసిన తర్వాత నేరుగా యూఏఈ చేరుకుంటారు..

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌కి భారత జట్టు: కెఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహార్, షాబజ్ అహ్మద్

Follow Us:
Download App:
  • android
  • ios