Abu Dhabi Knight Riders: ఐపీఎల్  పుణ్యమా అని ఇక్కడి ఫ్రాంచైజీలకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు దక్కుతున్నది. భారత్ లో విజయవంతమైన ఐపీఎల్ ను స్ఫూర్తిగా తీసుకుని వివిధ దేశాలలో కూడా టీ20 లీగ్ లు వెలుస్తున్నాయి. యూఏఈలో కూడా ఇలాంటిదే ఇటీవలే మొదలైంది. 

బాలీవుడ్ బాద్షా, ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్ ఎడారిగడ్డ మీద కాలుమోపాడు. అక్కడ నిర్వహిస్తున్న యూఏఈ టీ20 లీగ్ లో అబుదాబి ఫ్రాంచైజీని షారుక్ ఖాన్ ఆధ్వర్యంలోని కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకున్నది. కొత్త ఫ్రాంచైజీకి అబుదాబి నైట్ రైడర్స్ అనే పేరును కూడా ఖరారు చేసింది. ఈ విషయాన్ని కేకేఆర్ తన ట్విటర్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది. కేకేఆర్ కు షారుక్ ఖాన్ తో పాటు ప్రముఖ బాలీవుడ్ నటి జూహీ చావ్లా భర్త జై మెహతా కూడా సహా యజమానిగా ఉన్న విషయం తెలిసిందే.

2008లో ఐపీఎల్ లో కోల్కతా ఫ్రాంచైజీని దక్కించుకున్న షారుక్ ఖాన్.. 2015లో వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా షారుక్ కు ట్రిన్బాగో నైట్ రైడర్స్ (టీకేఆర్) కూడా ఉంది. ఈ రెండింటితో పాటు నైట్ రైడర్స్ ను ఇటీవలే యూఎస్ కు కూడా తీసుకెళ్లాడు బాద్షా. ఇప్పుడు తాజాగా యూఏఈలో కూడా ఫ్రాంచైజీని దక్కించుకోవడం విశేషం. 

ఇప్పటికే 3 ఫ్రాంచైజీలతో ఉన్న కేకేఆర్ కు ఇది నాలుగో ఫ్రాంచైజీ. అబుదాబి నైట్ రైడర్స్ ను దక్కించుకోవడంపై షారుక్ స్పందిస్తూ.. ‘గత కొన్నేండ్లుగా నైట్ రైడర్స్ ను విశ్వవ్యాప్తం చేస్తున్నాం. యూఏఈ లో టీ20 క్రికెట్ క్రేజ్ నానాటికీ పెరుగుతున్నది. కొత్తగా అబుదాబి ఫ్రాంచైజీని చేజిక్కించుకోవడం ఎగ్జైటింగ్ గా ఉంది. ఇక్కడి మాదిరిగానే అక్కడ (యూఏఈ) లో కూడా మేము విజయవంతమవుతామనే నమ్మకముంది..’ అని తెలిపాడు. 

Scroll to load tweet…

పది రోజుల క్రితమే షారుక్ ఖాన్.. అమెరికా ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన మేజర్ లీగ్ క్రికెట్ టీ20 (ఎంఎల్సీ) లో కూడా భాగమైన విషయం తెలిసిందే. యూఎస్ఎలో 2023లో ఓ భారీ క్రికెట్ లీగ్ ను నిర్వహించేందుకు ఎంఎల్సీ సిద్ధమవుతున్నది. దాని తర్వాత కూడా అమెరికాలో విరివిగా క్రికెట్ వ్యాప్తి కోసం కృషి చేసేందుకు సన్నాహాకాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సుమారు 25 నుంచి 30 యూఎస్ మిలియన్ డాలర్ల ఖర్చుతో లాస్ ఏంజెల్స్ కు 40 మైళ్ల దూరంలో ఉన్న సౌత్ కాలిఫోర్నియా లో గల ఇర్వైన్ నగరంలో సుమారు పదివేల మంది సీటింగ్ కెపాజిటీ తో క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు నైట్ రైడర్స్ గ్రూప్ కేఆర్జీ-ఎంఎల్సీ ల మధ్య అవగాహన కుదిరింది.

కేకేఆర్ ఫ్రాంచైజీలు : 

- కోల్కతా నైట్ రైడర్స్ (ఐపీఎల్) 
- ట్రిన్బాగో నైట్ రైడర్స్ (సీపీఎల్) 
- అబుదాబి నైట్ రైడర్స్ (యూఏఈ టీ20 లీగ్) 
- ఎల్ఏ (లాస్ ఏంజెల్స్) ఫ్రాంచైజీ (మేజర్ లీగ్ క్రికెట్) 

ఇక యూఏఈలో కేకేఆర్ తో పాటు ఇదివరకే ముంబై ఇండియన్స్ జట్టు కూడా ఓ ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది. అంతేగాక ఐపీఎల్ లోని ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఓ ఫ్రాంచైజీ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం.