సెయింట్ లూసియా: భారత మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టింది. తన అద్భుతమైన ప్రదర్శనతో తొలి మ్యాచులోనే ఆమె రికార్డు సృష్టించింది. తన 15 ఏళ్ల వయస్సులో షఫాలీ వర్మ అంతర్జాతీయ క్రికెట్ లోకి ఆరంగేట్రం చేసింది. తద్వారా అంతర్జాతీయ ట్వంటీ20 మ్యాచులోకి అడుగు పెట్టిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. 

అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టిన రెండు నెలల లోపలే ఆమె సచిన్ టెండూల్కర్ పేర ఉన్న మరో రికార్డును కూడా బద్దలు కొట్టింది 15 ఏళ్ల 286 రోజుల వయస్సులో భారతదేశం తరఫున  అంతర్జాతీయ క్రికెట్ లో అర్థ సెంచరీ చేసిన క్రికెటర్ గా రికార్డు సృష్టించింది. తద్వారా  16 ఏళ్ల వయస్సులో ఆర్థ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సచిన్ పేర ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. ఆమె సృష్టించిన ప్రత్యేకమైన రికార్డను బిసీసీఐ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. 

 

సెయింట్ లూసియానాలో వెస్టిండీస్ పై జరిగిన టీ20 మ్యాచులో 15 ఏళ్ల షెఫాలీ తన తొలి అర్థ సెంచరీని నమోదు చేసింది. భారత ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధానా 143 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి శుభారంభాన్ని అందించారు. తన కెరీర్ లో ఐదో టీ20 ఆడుతున్న షెఫాలీ అర్థ సెంచరీ చేసింది. ఆమె 49 బంతుల్లో 73 పరుగులు చేసింది. మరో వైపు మందానా 46 బంతుల్లో 67 పరుగులు చేసింది. తన 49 బంతుల్లో షెఫాలీ ఆరు ఫోర్లు,త నాలుగు సిక్స్ లు బాదింది.

వారిద్దరి ప్రదర్శనతో భారత్ 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ మహిళల జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 101 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఏ సమయంలోనూ వెస్టిండీస్ భారత్ కు పోటీ ఇవ్వలేకపోయింది. 

శిఖా పాండే, రాధా యాదవ్, పూనమ్ యాదవ్ తలో రెండు వికెట్లు తీసుకోగా, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ తలో వికెట్ తీసుకున్నారు. దీంతో ఐదు మ్యాచులో సిరీస్ లో తొలి టీ20 మ్యాచును 84 పరుగుల తేడాతో భారత్ గెలుచుకుంది.