క్రికెటర్ మహ్మద్ షమీకి ఎదురుదెబ్బ.. భరణం చెల్లించాలని కోర్టు ఆదేశం.. ప్రతి నెలా ఎంత ఇవ్వాలంటే.. ?
క్రికెటర్ మహ్మద్ షమీకి కోర్టులో చుక్కెదురైంది. తన భార్య హసిన్ జహాన్‌కు నెలకు రూ.50,000 చెల్లించాలనీ, తన కూతురు పోషణకు నెలకు 80 వేలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

టీమిండియా ఆటగాడు మహ్మద్ షమీ, తన భార్య హసిన్ జహాన్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. మహ్మద్ షమీతో విభేదాల కారణంగా హసిన్ జహాన్ తన కుమార్తెతో చాలా కాలంగా విడిగా ఉంటోంది. ఈ జంటకు సంబంధించి కోల్‌కతా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాల మేరకు క్రికెటర్ మహ్మద్ షమీ తన భార్య హసిన్ జహాన్‌కు నెలవారీ భరణం రూ.1 లక్ష 30 వేలు చెల్లించాల్సి ఉంటుంది.అందులో రూ.50,000లను హసిన్ జహాన్ కు వ్యక్తిగత భరణంగా.. ఆమెతో పాటు ఉంటున్న కుమార్తె పోషణకు రూ.80 వేలు ఖర్చు చేయాలని ఆదేశించింది. ఐదేళ్ల న్యాయ పోరాటం తర్వాత హసిన్ జహాన్ ఈ విజయం సాధించింది.
వాస్తవానికి హసిన్ జహాన్, క్రికెటర్ మహ్మద్ షమీలు 2014లో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కూతురు కూడా ఉంది, కానీ.. ఈ వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2018లో హసిన్ జహాన్ మహ్మద్ షమీపై గృహ హింస, దాడి, వరకట్న వేధింపులు, క్రికెట్ ఫిక్సింగ్ వంటి అనేక తీవ్రమైన ఆరోపణలు చేసింది. తన భార్య చేసిన ఆరోపణలన్నింటినీ మహ్మద్ షమీ ఖండించాడు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. విడిపోయిన తర్వాత కూడా ఇద్దరూ విడాకులు తీసుకోలేదు. ఈ విషయం చాలా కాలంగా హెడ్‌లైన్స్‌లో ఉంది. అయినప్పటికీ, ఫిక్సింగ్‌కు సంబంధించి BCCI విచారణలో అతను నిర్దోషి అని నిరూపించబడ్డారు.
హసీన్ జహాన్ డిమాండ్
2018లో హసన్‌కు నెలవారీ రూ. 10 లక్షల భరణం ఇవ్వాలని, అందులో రూ. 7,00,000 వ్యక్తిగత గా.. మిగిలిన రూ. 3,00,000 తమ కుమార్తె పోషణకు చెల్లించాలని హసిన్ జహాన్ కోర్టులో దావా వేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారత పేసర్ ఆదాయపు పన్ను రిటర్న్ ప్రకారం.. ఆ ఆర్థిక సంవత్సరంలో అతని వార్షిక ఆదాయం రూ. 7 కోట్ల కంటే ఎక్కువగా ఉందని, దాని ఆధారంగా నెలవారీ ఆదాయాన్ని కోరినట్లు ఆమె తరుపు న్యాయవాది మృగాంక మిస్త్రీ కోర్టుకు తెలియజేశారు.
షమీ తరపు న్యాయవాది ఈ వాదనలు తీవ్రంగా ఖండించారు. షమీ తరపు న్యాయవాది సెలిమ్ రెహమాన్ మాట్లాడుతూ.. హసిన్ జహాన్ స్వయంగా వృత్తిరీత్యా ఫ్యాషన్ మోడల్‌గా పని చేయడం ద్వారా స్థిరమైన ఆదాయాన్ని సంపాదిస్తున్నందున, ఆ అధిక భరణం డిమాండ్ సమర్థించబడదని పేర్కొన్నారు. ఎట్టకేలకు ఇరువర్గాల వాదనలు విన్న కింది కోర్టు సోమవారం నెలవారీ భరణం రూ.1.30 లక్షలుగా నిర్ణయించింది. కోర్టు ఆదేశాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, హసిన్ జహాన్ నెలవారీ భరణం మొత్తం ఎక్కువగా ఉంటే తాను ఉపశమనం పొందుతానని పేర్కొంది. షమీ మాత్రం నివేదికపై ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించలేదు.