ICC Womens T20 World Cup: ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలలో భారత్ కు మరోసారి నిరాశే ఎదురైంది. మహిళల టీ20 ప్రపంచకప్ లో టీమిండియా మరో ఓటమితో అభిమానుల గుండె పలిగింది. సెమీస్ గండాలను దాటలేక భారత్ మరోమారు ఇంటిబాట పట్టింది.
2013 జూన్ 23.. ఐసీసీ నిర్వహించే కీలక టోర్నీలలో భారత్ చివరిసారిగా గెలిచిన ట్రోఫీ తేదీ అది. 2013లో ఐసీసీ నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ ను ఓడించిన భారత్ టైటిల్ నెగ్గింది. కానీ ఆతర్వాత భారత్ కు నిరాశ తప్పడంలేదు. సుమారు పదేండ్లుగా ప్రతీ ఏడాది పురుషుల, మహిళల విభాగాల్లో భారత్ సెమీస్, ఫైనల్స్ వరకు చేరుకుంటున్నా తుది అడుగు మాత్రం సరిగ్గా వేయలేకపోతున్నది. గతేడాది రోహిత్ శర్మ సారథ్యంలోని భారత పురుషుల జట్టు సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడగా తాజాగా టోర్నీ ఆసాంతం బాగా ఆడి టైటిల్ మీద ఆశలు రేపిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. సెమీస్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడటంతో మరోమారు భారత అభిమానుల గుండె పలిగింది.
ఐసీసీ ట్రోఫీలలో లీగ్ దశలో అదరగొట్టడం, అప్పటి వరకు దూకుడుగా ఆడే భారత జట్టు సెమీస్ గండాన్ని మాత్రం దాటలేకపోతున్నది. రనౌట్, బౌలింగ్ వైఫల్యం, బ్యాటర్ల తడబాటు.. కారణం ఏదైతేనేమీ గడిచిన పదేండ్లుగా భారత అభిమానులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఆ వేదన తీరేది కాదు.
పదేండ్ల ప్రస్థానం..
- 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలో గెలిచాక 2014లో టీ20 ప్రపంచకప్ జరిగింది. ఫైనల్లో భారత్ - శ్రీలంక. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 130 పరుగులే చేసింది. కోహ్లీ (77) తప్ప మిగతా బ్యాటర్లు విఫలం. లక్ష్యాన్ని లంక.. 17.5 ఓవర్లలోనే ఛేదించింది. అదే ఏడాది మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత్ గ్రూప్ స్టేజ్ కే పరిమితమైంది.
- 2015 పురుషుల వన్డే వరల్డ్ కప్ సెమీస్. ఇండియా వర్సెస్ ఆస్రేలియా. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 328 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత్ 233 పరుగులకే ఆలౌట్ అయింది.
- 2016లో మహిళల టీ20 ప్రపంచకప్ లో మిథాలీ రాజ్ సారథ్యంలోని భారత జట్టు మరోసారి నిరాశపరిచింది. ఈసారి కూడా భారత్ గ్రూప్ స్టేజ్ కే పరిమితమైంది. ఇదే ఏడాది పురుషుల టీ20 ప్రపంచకప్ లో భారత్ - వెస్టిండీస్ సెమీస్. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 192 పరుగుల భారీ స్కోరు చేసింది. కానీ 19.4 ఓవర్లలోనే విండీస్ లక్ష్యాన్ని ఊదేసింది.
-2017లో పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ కు దారుణ పరాభవం. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. 50 ఓవర్లకు 338 పరుగులు చేయగా భారత్ 158 పరుగులకే కుప్పకూలింది. అదే ఏడాది మహిళల వన్డే ప్రపంచకప్ లో భారత్ ఫైనల్ చేరింది. ఫైనల్ లో భారత్ - ఇంగ్లాండ్ తలబడ్డాయి. ఆ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 228 పరుగులు చేయగా భారత్ 219 పరుగులకే ఆలౌట్ అయింది. 2018లో ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భారత్ సెమీస్ లోనే ఓడింది.
- 2019 వన్డే వరల్డ్ కప్. భారత్ సెమీస్ చేరింది. ఈ విషాదాన్ని భారత అభిమానులు ఎప్పటికీ మరిచిపోరు. సెమీస్ లో భారత జట్టు న్యూజిలాండ్ చేతిలో ఓడింది. ధోని రనౌట్. ఇ(ఎ)ప్పటికీ వెంటాడే బాధ.
- 2020 లో మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత్ ఫైనల్ చేరింది. ఫైనల్ పోరు ఆసీస్ తో. మళ్లీ నిరాశ తప్పలేదు.
- 2021 ఐసీసీ పురుషుల టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్. ఫైనల్లో భారత్ - న్యూజిలాండ్. 2019 లో భారత్ కు షాకిచ్చిన కివీస్ మరోసారి దెబ్బకొట్టింది. ఇదే ఏడాది దుబాయ్ లో జరగిన టీ20 ప్రపంచకప్ లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు గ్రూప్ స్టేజ్ లోనే ఇంటిముఖం పట్టింది.
- 2022 లో మహిళల వన్డే వరల్డ్ కప్. భారత్ ఈసారి కూడా గ్రూప్ స్టేజ్ లోనే వెనుదిరిగింది. ఇదే ఏడాది కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా భారత్ ఫైనల్ చేరింది. కానీ అక్కడా నిరాశే. గతేడాది రోహిత్ శర్మ బృందం సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో అవమానకర రీతిలో ఓడింది.
- పదేండ్లుగా సాగుతున్న ఈ వ్యథను రెట్టింపు చేస్తూ 2023 ఐసీసీ మహిళల ప్రపంచకప్ సెమీస్ లో భారత్ కు ఆసీస్ మరో షాకిచ్చింది.
ఈ ఏడాది అక్టోబర్ లో భారత జట్టు స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ ఆడనుంది. మరి ఈసారైనా భారత అభిమానుల పదేండ్ల ఎదురుచూపులు ముగుస్తాయా..?
