Scotland vs papua new guinea: టీ20 ప్రపంచకప్ లో భాగంగా క్వాలిఫయింగ్ రౌండ్ లో జరుగుతున్న పోటీలో స్కాట్లాండ్ మరోసారి బ్యాట్ తో మెరిసింది. పపువా  న్యూ గినియాతో జరుగుతున్న మ్యాచ్ లో రెచ్చిపోయి ఆడింది. 

ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 World cup2021) లో భాగంగా జరుగుతున్న క్వాలిఫయింగ్ రౌండ్ లో స్కాట్లాండ్ (Scotland) మరోసారి బ్యాటింగ్ లో మెరిసింది. పపువా న్యూ గినియా (Papua New Guinea- PNG)తో జరుగుతున్న మ్యాచ్ లో ఆ జట్టు తొలుత టాస్ నెగ్గి పీఎన్జీ (PNG) ఎదుట భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. స్కాట్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న స్కాట్లాండ్.. ఓపెనర్లిద్దరినీ త్వరగానే కోల్పోయింది. కెప్టెన్ కోయిట్జర్ (6), జార్జ్ మున్సీ (15) వెంట వెంటనే ఔటయ్యారు. 20 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్ ను వికెట్ కీపర్ మాథ్యూ క్రాస్ (36 బంతుల్లో 45), రిచి బెర్రింగ్టన్ (49 బంతుల్లో 70) ఆదుకున్నారు.

Scroll to load tweet…

వీరిద్దరూ అబేధ్యమైన మూడో వికెట్ కు 92 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా ఆడుతున్న ఈ జోడిని సిమోన్ అటయ్ విడదీశాడు. క్రాస్ ఔటయ్యాక వచ్చిన వాళ్లు వచ్చినట్టుగా పెవిలియన్ చేరారు. గత మ్యాచ్ లో బ్యాటింగ్ లో రాణించిన క్రిస్ గ్రీవ్స్ కూడా ఈ మ్యాచ్ లో 2 పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం లక్ష్య ఛేదన ప్రారంభించిన పీఎన్జీ.. రెండు ఓవర్లు ముగిసే సరికి ఓపెనర్ టోని ఉర వికెట్ కోల్పోయి 8 పరుగులు చేసింది. 

Scroll to load tweet…

ఇక పీఎన్జీ బౌలర్లలో మొరియ 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా.. సోపర్ 4 ఓవర్లలో 24 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. టీ20 ఆరంభ మ్యాచ్ లో పపువా న్యూ గినియా.. ఒమన్ చేతిలో ఓడగా, ఆదివారం బంగ్లాదేశ్ తో జరిగిన పోరులో స్కాట్లాండ్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.