Cyclone Biparjoy: గుజరాత్ తీర ప్రాంతాన్ని వణికిస్తున్న బిపర్‌జోయ్ తుపాన్ వల్ల టీ20 క్రికెట్ లీగ్ ఒకటి వాయిదాపడింది.
గడిచిన మూడు, నాలుగు రోజులుగా గుజరాత్ తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్న బిపర్‌జోయ్.. అత్యంత తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపాన్‌గా బలహీనపడింది. గురువారం రాత్రి బిపర్‌జోయ్ కచ్ జిల్లాలో తీరం దాటి బలహీనపడినా ఇంకా వేలాది గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. కాగా ఈ తుపాన్ కారణంగా గుజరాత్ లో జరగాల్సిన ఓ ప్రముఖ క్రికెట్ టీ20 లీగ్ వాయిదాపడింది.
సౌరాష్ట్రలో జరిగే సౌరాష్ట్ర ప్రీమియర్ లీగ్ (ఎస్‌పీఎల్) బిపర్‌జోయ్ తుపాన్ కారణంగా వాయిదాపడింది. ఐదు జట్లతో జూన్ 15న ఈ టోర్నీని నిర్వహించేందుకు సన్నాహకాలు చేసినా తుపాన్ కారణంగా నిర్వాహకులు లీగ్ ను అర్ధాంతరంగా వాయిదా వేశారు.
ఇదే విషయమై సౌరాష్ట్ర క్రికెట్ ట్విటర్ ఖాతాలో స్పందించింది. ‘ఈ ప్రాంతంలో బిపర్‌జోయ్ తుపాన్ కారణంగా జూన్ 15 నుంచి మొదలుకాబోయే ఎస్‌పీఎల్ 2023ని వాయిదా వేస్తున్నాం. ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని మేం కోరుతున్నాం..’ అని ట్వీట్ లో తెలిపింది.
అయితే ఈ టోర్నీని తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారనేదానిపై సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. బిపర్‌జోయ్ విధ్వంసం ఇప్పటికీ కాస్త తెరిపినిచ్చినా మొత్తంగా అయితే ముగిసిపోలేదు. బిపర్‌జోయ్ బలహీనపడ్డా నేడు, రేపు గుజరాత్, రాజస్తాన్ లలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఎస్‌పీఎల్ 2023లో టీమ్స్..
- జల్వాద్ రాయల్స్
- కచ్ వారియర్స్
- హలర్ హీరోస్
- సూరత్ లయన్స్
- గోహ్లీవాడ్ గ్లాడియేటర్స్
జల్వాద్ రాయల్స్ కు షెల్డన్ జాక్సన్ కెప్టెన్ గా ఉండగా కచ్ టీమ్ కు ధర్మేంద్ర జడేజా సారథిగా వ్యవహరిస్తున్నాడు. హలర్ హీరోస్ కు అర్పిత్ వసవడ, సూరత్ లయన్స్ కు చిరాగ్ జాని.. గోహ్లీవాడ్ గ్లాడియేటర్స్‌కు ప్రేరక్ మన్కడ్ కెప్టెన్ గా ఉన్నాడు.
సౌరాష్ట్ర ప్రీమియర్ లీగ్ వాయిదాపడ్డా తమిళనాడు ప్రీమియర్ లీగ్, మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ మాత్రం కొనసాగుతున్నాయి.
ఇక, బిపర్‌జోయ్ తుపాను గురువారం గుజరాత్‌లో విధ్వంసం సృష్టించడంతో ఇద్దరు వ్యక్తులు (వరదల కారణంగా లోయలో చిక్కుకున్న మేకలను కాపాడేందుకు వెళ్లిన తండ్రీకొడుకులు) మరణించారు. 22 మంది గాయపడ్డారు, చాలా చోట్ల చెట్లు నేలకూలాయి. భారీ వర్షాలు, గాలులకు అనేక వాహనాలు, ఇళ్ళు దెబ్బతిన్నాయి. సహాయచర్యల్లో 18 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్డీఆర్ఎఫ్, 115 రోడ్లు భవనాల శాఖ బృందాలు, 397 విద్యుత్ శాఖ బృందాలు పాల్గొంటున్నాయి.
గుజరాత్‌లో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ, రహదారులపై కూలిన చెట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. జామ్‌నగర్ ఎయిర్‌పోర్టులో విమానయాన సేవలను నిలిపివేశారు. రైల్వే శాఖ కూడా పలు రైలు సర్వీసులను రద్దు చేసింది. ప్రస్తుతం బిపర్‌జోయ్ తుపాన్ రాజస్థాన్ దిశగా కదులుతుంది. ఈ సాయంత్రం రాజస్తాన్‌లో ప్రవేశించిన తర్వాత తుపాన్ మరింతగా బలహీనపడే అవకాశం ఉంది.
