Asianet News TeluguAsianet News Telugu

రుతురాజ్ పోరాటం వృథా.. ఫైనల్లో ‘మహా’ పరాజయం.. 14 ఏండ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీ సొంతం చేసుకున్న సౌరాష్ట్ర

Vijay Hazare Trophy 2022:  దేశవాళీ క్రికెట్ లో వన్డే ఫార్మాట్  లో ప్రముఖమైన విజయ్ హజారే ట్రోఫీని  సౌరాష్ట్ర సొంతం  చేసుకుంది. 14 ఏండ్ల తర్వాత  ఆ జట్టు  తిరిగి ఈ ట్రోఫీని  దక్కించుకుంది. ఫైనల్ లో మహారాష్ట్రకు పరాజయం తప్పలేదు. 

Saurashtra Beats Maharashtra by 5 Wickets, Won Vijay Hazare Trophy  2022  After 14 Years
Author
First Published Dec 2, 2022, 6:03 PM IST

మూడు వారాలుగా సాగిన విజయ్ హజారే ట్రోఫీ లో భాగంగా శుక్రవారం ముగిసిన ఫైనల్ పోరులో సౌరాష్ట్ర.. దేశవాళీ దిగ్గజం  మహారాష్ట్రపై  విజయదుందుభి మోగించింది.  ఫైనల్లో మహారాష్ట్ర సారథి రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో చెలరేగినా మిగతా ఆటగాళ్లు విఫలమవడంతో  ఆ జట్టు  నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్యాన్ని సౌరాష్ట్ర.. 46.3 ఓవర్లలోనే ఛేదించింది.  ఆ జట్టు తరఫున షెల్డన్ జాక్సన్..   చివరిదాకా క్రీజులో నిలిచి  14 ఏండ్ల తర్వాత  తన జట్టు విజయ్ హజారే ట్రోఫీ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. 

అహ్మాదాబాద్ లోని  నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముగిసిన ఈ మ్యాచ్ లో తొలుత  టాస్  ఓడి బ్యాటింగ్ కు వచ్చిన  మహారాష్ట్ర.. నాలుగో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది.  ఓపెనర్ పవన్ షా (4) , విఫలమయ్యాడు.   సౌరాష్ట్ర బౌలర్లు  కట్టుదిట్టంగా  బౌలింగ్ చేయడంతో   మహారాష్ట్ర కు పరుగుల రాక కష్టమైంది. 

సౌరాష్ట్ర బౌలర్ల విజృంభణతో  రుతురాజ్ తన హాఫ్ సెంచరీని  96 బంతుల్లో చేశాడు.   30 ఓవర్లకు  మహారాష్ట్ర స్కోరు 100 పరుగులు దాటింది.   రన్ రేట్ మరీ తక్కువగా ఉండటంతో రుతురాజ్ రెచ్చిపోయాడు.  తర్వాత 50 పరుగులు చేయడానికి రుతురాజ్ 29 బంతులే తీసుకున్నాడు.  సెంచరీ తర్వాత   రనౌట్ అయ్యాడు. రుతురాజ్ నిష్క్రమణ తర్వాత మహారాష్ట్ర తరఫున అజిమ్ కాజి (37), నౌషద్ షేక్ (31)  లు కాస్త ధాటిగా ఆడారు. దీంతో  ఆ జట్టు  నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. 

లక్ష్య ఛేదనలో సౌరాష్ట్రకు  వికెట్ కీపర్ హార్విక్ దేశాయ్ (50), షెల్డన్ జాక్సన్ (133 నాటౌట్) శుభారంభాన్ని అందించారు.  ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 125 పరుగులు జోడించారు. వన్ డౌన్ లో వచ్చిన జయ్ గోహ్లి (0), సమర్థ్ వ్యాస్ (12), అర్పిత్ వసవడ (15), ప్రేరక్ మాన్కడ్ (1) విఫలమైనా  చిరాగ్ జని (30 నాటౌట్) తో కలిసి జాక్సన్ సౌరాష్ట్రకు అదిరిపోయే విజయాన్ని అందించాడు. 

 

2002-03 సీజన్ నుంచి  విజయ్ హజారే ట్రోఫీని నిర్వహిస్తుండగా  2007-08 సీజన్ లో  సౌరాష్ట్ర తొలిసారి ఈ  ట్రోపీని గెలుచుకుంది.  తర్వత 2017-18 సీజన్ లో  ఫైనల్ చేరినా  తుదిపోరులో కర్నాటక చేతిలో ఓడి నిరాశచెందింది. అయితే ఈసారి ఎలాగైన గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగిన  జయదేవ్ ఉనద్కత్ సారథ్యంలోని  సౌరాష్ట్ర.. అన్ని విభాగాల్లో రాణించి  లక్ష్యాన్ని అందుకుంది.  ఈ ట్రోఫీని గతంలో తమిళనాడు  5 సార్లు గెలుచుకోగా ముంబై నాలుగు సార్లు నెగ్గింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios