India Tour Of West Indies: విండీస్  సిరీస్ లో కూడా తనను ఎంపిక చేయకపోవడంతో సర్ఫరాజ్ ఖాన్ బీసీసీఐకి కౌంటర్ ఇచ్చాడు.

ఆలిండియా సెలక్షన్ కమిటీ ఇటీవలే వెస్టిండీస్ పర్యటనకు వెళ్లబోయే భారత జట్టును ప్రకటించింది. ఈ టీమ్ లో మరోసారి దేశవాళీ క్రికెట్ లో టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ను సెలక్టర్లు పట్టించుకోలేదు. ఏడాదికాలంగా సర్ఫరాజ్. ‘ఇక నెక్స్ట్ సిరీస్ కు వస్తాడు’ అనుకున్న ప్రతీసారి అతడిని సెలక్టర్లు పక్కనబెడుతున్నారు. 

తాజాగా విండీస్ సిరీస్ లో కూడా తనను ఎంపిక చేయకపోవడంతో సర్ఫరాజ్ ఖాన్ బీసీసీఐకి కౌంటర్ ఇచ్చాడు. తన అభిప్రాయాన్ని స్వేచ్చగా వెల్లడించే అవకాశమున్న సోషల్ మీడియా వేదిక ద్వారా సర్ఫరాజ్.. బీసీసీఐ, సెలక్టర్లకు అర్థమయ్యేలా ‘ఇది సార్ నా బ్రాండ్’ అని బల్లగుద్ది మరీ చెప్పాడు. 

వెస్టిండీస్ టూర్ కు టీమిండియాను ప్రకటించిన తర్వాత సర్ఫరాజ్.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఫస్ట్ క్లాస్ కెరీర్ లో తన రికార్డులు, పరుగులకు సంబంధించిన టైటిల్ కార్డును షేర్ చేశాడు. 25 ఏండ్ల ఈ ముంబై బ్యాటర్ ఇప్పటివరకు ఆడిన 53 ఇన్నింగ్స్ లలో ఏకంగా 80.48 సగటుతో 3,380 పరుగులు చేయడం గమనార్హం.

Scroll to load tweet…

ఇందులో 9 హాఫ్ సెంచరీలు, 12 సెంచరీలు ఉండగా అత్యధిక స్కోరు 301 నాటౌట్ గా ఉంది. గడిచిన మూడు సీజన్లలో సర్ఫరాజ్.. భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. ఆ గణాంకాలను ఓసారి చూస్తే.. 

- 2019-20 రంజీ : 9 ఇన్నింగ్స్, 928 పరుగులు
- 2020-21 రంజీ : 9 ఇన్నింగ్స్, 982 పరుగులు 
- 2022 రంజీ : 9 ఇన్నింగ్స్, 566 పరుగులు

దేశవాళీ క్రికెట్ లో అలుపెరుగని యోధుడిలా పరుగులు చేస్తున్నా సర్ఫరాజ్ ఖాన్ ను పట్టించుకోకపోవడంపై మాజీ ఆటగాళ్లు, అభిమానులు కూడా సెలక్టర్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. ‘సర్ఫరాజ్ ఖాన్ రంజీల్లో అదరగొడుతున్నాడు. మూడు సీజన్లలో అతని పర్ఫామెన్స్ రికార్డు లెవెల్లో ఉంది. దాదాపు 100 సగటుతో పరుగులు చేస్తున్నాడు. అయినా అతనికి చోటు దక్కడం లేదు. టీమ్‌లోకి రావాలంటే అతను ఇంకేం చేయాలి. తుది జట్టులో చోటు ఇవ్వకపోయినా కనీసం అతన్ని ఎంపిక చేస్తే, రంజీల్లో ఆడుతున్నదానికి గుర్తింపు దక్కిందనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ సెలక్టర్లు మాత్రం ఐపీఎల్ ఆడిన వాళ్లకే టీమ్‌లో చోటు ఇస్తున్నారు..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

Scroll to load tweet…

ఇక సర్ఫరాజ్ తన స్టాట్స్ ను చూపుతున్న టైటిల్ కార్డుతో పాటు తాను ఆడిన ఓ మ్యాచ్ లో అన్నిదిశలా షాట్స్ ఆడుతున్న మరో వీడియోను కూడా పోస్ట్ చేసి తాను కూడా మెరుగైన ప్లేయర్ అని చెప్పకనే చెప్పాడు.