Asianet News TeluguAsianet News Telugu

ఊరించిన విజయం.. డ్రాతో సంతృప్తి.. సర్ఫరాజ్ సెంచరీతో బతికిపోయిన పాకిస్తాన్.. కివీస్ కు నిరాశ

PAKvsNZ: పాకిస్తాన్  - న్యూజిలాండ్ నడుమ  కరాచీ వేదికగా ముగిసిన టెస్టు డ్రా గా ముగిసింది. చివరి బంతి వరకూ  విజయం కోసం ఇరు జట్లు   పోరాడాయి. కానీ ఫలితం మాత్రం డ్రా గా మిగిలింది. 

Sarfaraz Ahmed Brave Hundred Saves Pakistan in Karachi Test vs New Zealand, Series Draw
Author
First Published Jan 6, 2023, 7:25 PM IST

ఇటీవలే ఇంగ్లాండ్ తో మూడు టెస్టుల సిరీస్ లో  భాగంగా  అన్ని మ్యాచ్ లు ఓడి అవమానాల పాలైన  పాకిస్తాన్ మరో ఓటమి నుంచి బతికిపోయింది.   న్యూజిలాండ్ తో కరాచీ వేదికగా ముగిసిన   రెండో టెస్టులో పాకిస్తాన్  తృటిలో అపజయం నుంచి బయటపడింది. చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చిన మాజీ సారథి సర్ఫరాజ్ అహ్మద్ వీరోచిత సెంచరీతో పాక్ ఓటమి గండాన్ని గట్టెక్కింది. లేకుంటే  మరో సిరీస్ ఓటమి   చవిచూడాల్సి వచ్చేది. సర్ఫరాజ్ (118) సెంచరీతో   రెండో టెస్టులో పాకిస్తాన్ డ్రాతో గట్టెక్కింది. ఫలితంగా  టెస్టు డ్రా గా ముగిసింది. తొలి టెస్టులో కూడా ఫలితం తేలకపోవడంతో  సిరీస్ డ్రా అయ్యింది.   

కరాచీ వేదికగా జరిగిన ఈ టెస్టులో  న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో  449 పరుగులు చేసింది.  పాకిస్తాన్ 408 పరుగులకే ఆలౌట్ అయింది.  41 పరుగుల తొలి ఆధిక్యం కలుపుకుని కివీస్ రెండో ఇన్నింగ్స్ లో  277 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఫలితంగా పాకిస్తాన్ ఎదుట  318 పరుగుల విజయలక్ష్యాన్ని నిలిపింది.   

ఆట ఐదో రోజు  బ్యాటింగ్ కు వచ్చిన పాకిస్తాన్..  ఆదిలోనే డబుల్ షాకులు తాకాయి. స్కోరు బోర్డుపై పరుగైనా చేరకుండానే  అబ్దుల్లా షఫీక్, మిర్ హమ్జా లు డకౌట్ అయ్యారు. స్కోరు 35 పరుగుల వద్ద ఉండగా ఇమామ్ ఉల్ హఖ్ (12)  ఇష్ సోధి బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.  తర్వాత కొద్దిసేపు క్రీజులో నిలిచిన  కెప్టెన్ బాబర్ ఆజమ్ (27) ను బ్రాస్వెల్ ఔట్ చేశాడు. షాన్ మసూద్ (35) ను కూడా అతడే బోల్తా కొట్టించాడు.  80 పరుగులకే పాకిస్తాన్ ఐదు కీలక వికెట్లను కోల్పోయింది. 

 

ఆ క్రమంలో  ఇక కివీస్ విజయం లాంఛనమే అనుకున్నారంతా. కానీ రెండేండ్ల తర్వాత జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ అద్భుతం చేశాడు.  సౌద్ షకీల్ (146 బంతుల్లో 32) తో కలిసి  ఆరో వికెట్ కు 123 పరుగులు జత చేశాడు.  షకీల్ ఔటయ్యాక   అగా సల్మాన్ (30) కూడా సర్ఫరాజ్ కు  సాయం అందించాడు.   కానీ హెన్రీ.. సల్మాన్ ను  బలిగొన్నాడు. ఆ తర్వాత  పాకిస్తాన్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది.  కానీ చివర్లో  నసీమ్ షా (11 బంతుల్లో 15 నాటౌట్)  పాక్ ను  ఆదుకున్నాడు.   పాక్ స్కోరు 304 వద్ద ఉండగా  ఇన్నింగ్స్ ముగిసింది. ఒక వికెట్ తేడాతో పాకిస్తాన్ బతికిపోగా అదే తేడాతో కివీస్ కు విజయం మిస్ అయింది.  ఈ పర్యటనలో  భాగంగా కివీస్.. పాక్ తో మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. జనవరి 9 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios