ఫిబ్రవరి 16న సెల్ఫీ ఇవ్వలేదని క్రికెటర్ పృథ్వీ షా కారుపై బేస్‌బాల్ బ్యాటుతో దాడి చేసిన మోడల్ సప్న గిల్.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు... బెయిల్ ద్వారా బయటికి... వెంటనే క్రికెటర్‌పై కేసులు.. 

భారత క్రికెటర్ పృథ్వీ షాతో సెల్ఫీ కోసం గొడవ పడి రచ్చ చేసిన ఇన్‌స్టా మోడల్ సప్న గిల్, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేలా కనిపించడం లేదు. ముంబై హోటల్‌లో పృథ్వీ షాని చూసిన సప్న గిల్, స్నేహితులతో కలిసి సెల్ఫీ దిగాలని చూసింది. అయితే పృథ్వీ షా, సెల్ఫీ ఇచ్చేందుకు నిరాకరించడంతో అతని కారుని వెంబడించి బేస్‌బాల్ బ్యాటుతో క్రికెటర్ కారుపై దాడి చేసింది.

ఈ దాడిలో పృథ్వీ షా పయనిస్తున్న కారు అద్ధాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అంతేకాకుండా క్రికెటర్ నుంచి రూ.50 వేల నగదుని డిమాండ్ చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సప్న గిల్‌ని కోర్టులో హాజరు పరిచారు. ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది ముంబైలోని స్థానిక న్యాయ స్థానం...

Scroll to load tweet…

ఐదు రోజుల తర్వాత బెయిల్ ద్వారా బయటికి వచ్చిన సప్న గిల్, రివర్సులో పృథ్వీ షాపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. బెయిల్ ద్వారా బయటికి వచ్చిన సమయంలోనే పృథ్వీ షాపై పలు కేసులు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలిపింది సప్న గిల్. చెప్పినట్టుగానే ఏకంగా లైంగిక వేధింపుల కేసు పెట్టింది.. సప్న గిల్ ఫిర్యాదుతో పృథ్వీ షాపై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు...

పృథ్వీ షాతో పాటు అతని స్నేహితులు ఆశీష్ సురేంద్ర యాదవ్, బ్రిజేశ్ తదితరులపై లైంగిక వేధింపులతో పాటు సప్నా గిల్‌ పరువుకి భంగం కలిగించే విధంగా వ్యవహరించినందుకు సెక్షన్ 34, 120బీ, 144, 146, 148, 149, 323, 324, 351, 354, 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా ఇన్‌స్టాగ్రామ్ మోడల్ తరుపు న్యాయవాది ఆలీ కశీష్ దేశ్‌ముఖ్ తెలియచేశాడు..

పృథ్వీ షాతో గొడవ తర్వాత సప్న గిల్‌కి మంచి పాపులారిటీ దక్కింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కూడా మరింత పెరిగింది. అనుకోకుండా వచ్చిన క్రేజ్‌ని మరింత పెంచుకునేందుకే సప్న గిల్, ఈ చీప్ ట్రిక్స్ వేస్తుందనేది చాలామంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పాపులారిటీతో సప్న గిల్ త్వరలోనే హిందీ బిగ్‌బాస్ కార్యక్రమంలో ప్రత్యక్షమైనా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు..

కొన్ని భోజ్‌పురి సినిమాల్లో కూడా నటించిన సప్న గిల్, సోషల్ మీడియాలో చిట్టి పొట్టి దుస్తుల్లో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ, లక్షల్లో ఫాలోవర్లను సంపాదించుకుంది..