అబుదాబి: ఐపిఎల్ సీజన్ 13లో రాజస్థాన్ రాయల్స్ ఆడిన తొలి రెండు మ్యాచుల్లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు కేరళ కుర్రాడు సంజూ శాంసన్. అయితే నిన్న(బుధవారం) జరిగిన మ్యాచ్ లో మాత్రం బ్యాటింగ్ తో ఆకట్టుకోలేకపోయినా ఓ అద్భుతమైన క్యాచ్ ను అందుకుని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చేత ప్రశంసలను పొందాడు. కెకెఆర్ చేతిలో రాజస్థాన్ ఓడినా శాంసన్ మాత్రం ఒకే ఒక్క క్యాచ్ తో అభిమానుల మనసు దోచుకున్నాడు. 

ఐపిఎల్ సీజన్ 13లో 12వ మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో శాంసన్ బౌండరీ వద్ద కమ్మిన్స్ క్యాచ్ ను అద్భుతంగా అందుకున్నాడు. వెన్నక్కి వెళుతూ క్యాచ్ ను అందుకునే ప్రయత్నంలో అతడి తల నేలకు బలంగా తాకింది. అయినప్పటికి నొప్పి బాధిస్తున్నా చేతిలో బంతిని అలాగే ఒడిసిపట్టుకున్నాడు. ఇలా తనకు తగిలిన దెబ్బ కంటే జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ అంకితభావమే అతన్ని మరోసారి హీరోను చేసింది. 

''నీవు పట్టిన క్యాచ్ అద్భుతం. క్యాచ్ పట్టే క్రమంలో నీ తల నేలకు తగలడంతో ఎంతలా బాధపడ్డావో నాకు తెలుసు. నేనూ ఆ బాధను ప్రత్యక్షంగా అనుభవించారు. 1992 ప్రపంచ కప్ సమయంలో వెస్టిండిస్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా నేను కూడా ఇలాగే క్యాచ్ అందుకుంటూ గాయపడ్డాను'' అంటూ శాంసన్ కు ట్యాగ్ చేస్తూ సచిన్ ట్వీట్ చేశారు.  

 

ఇక ఐపిఎల్ 2020 సీజన్ 13లో తొలి రెండుమ్యాచుల్లో అద్భుత విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్ బుధవారం తొలి పరాజయాన్ని చవి చూసింది. బౌలింగ్‌లో బాగానే
ఆకట్టుకున్నా, బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైన రాయల్స్ టీం కోల్‌కత్తా చేతిలో చిత్తుగా ఓడింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో పాటు మొదటి రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసిన సంజూ శాంసన్ కూడా త్వరగా పెవిలియన్ చేరడంతో టాపార్డర్, మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది.

కెప్టెన్ స్టీవ్ స్మిత్ 3 పరుగులకు, సంజూ శాంసన్ 8 పరుగులకు అవుట్ కాగా జోస్ బట్లర్ 16 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.  రాబిన్ ఊతప్ప 2, రియాన్ పరాగ్ 1 పరుగు చేసి అవుట్ కాగా లాస్ట్ మ్యాచ్ ‘గేమ్ ఛేంజర్’ 14 పరుగులు చేశాడు. శ్రేయాస్ గోపాల్ 5, ఆర్చర్ 6, ఉనద్కడ్ 9 పరుగులు చేయగా టామ్ కుర్రాన్ ఒంటరి పోరాటం చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

టామ్ కుర్రాన్, అంకిత్ రాజ్‌పుత్ చివర్లో దూకుడుగా ఆడడంతో ఆలౌట్ కాకుండా తప్పించుకుంది రాజస్థాన్ రాయల్స్. శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి, కమ్లేశ్ నాగర్‌కోటి రెండేసి
వికెట్లు తీయగా సునీల్ నరైన్, ప్యాట్ కమ్మిన్స్, కుల్దీప్ యాదవ్ తలా ఓ వికెట్ తీశారు.