Asianet News TeluguAsianet News Telugu

సెన్సేషనల్ సంజూ శాంసన్... మొదటి వన్డేలో పోరాడి ఓడిన టీమిండియా...

తొలి వన్డేలో 9 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా... 86 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన సంజూ శాంసన్... హాఫ్ సెంచరీ చేసి అవుటైన శ్రేయాస్ అయ్యర్... 

Sanju Samson Sensational Innings, South Africa beats Team India in 1st ODI
Author
First Published Oct 6, 2022, 10:44 PM IST

సీనియర్లకు రెస్ట్ ఇవ్వడంతో వన్డే జట్టులోకి వచ్చిన జూనియర్లు, స్టార్ ప్లేయర్లతో నిండిన సఫారీ జట్టుకు చుక్కలు చూపించారు. ఆరంభంలో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తూ సాగిన తొలి వన్డేలో చివరి వరకూ పోరాడిన భారత జట్టు 9 పరుగుల తేడాతో ఓడింది..టాపార్డర్ ఫెయిల్ అయినా మిడిల్ ఆర్డర్‌లో శ్రేయాస్ అయ్యర్ రాణించగా, శార్దూల్ ఠాకూర్ మెరుపులు మెరిపించగా ఆఖర్లో సంజూ శాంసన్ సెన్సేషనల్ ఇన్నింగ్స్‌తో ప్రేక్షకులకు కావాల్సినంత మజాని అందించాడు. 

250 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన టీమిండియాకి శుభారంభం దక్కలేదు. 7 బంతుల్లో 3 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, కగిసో రబాడా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గిల్ అవుటైన తర్వాత వరుసగా మూడు ఓవర్ల పాటు పరుగులేమీ చేయలేకపోయింది భారత జట్టు...

16 బంతుల్లో 4 పరుగులు చేసిన శిఖర్ ధావన్, పార్నెల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ కలిసి జిడ్డు బ్యాటింగ్‌తో ప్రేక్షకులను విసిగించారు.

42 బంతులు ఆడి ఓ ఫోర్‌తో 19 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, షంసీ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ముందుకు వచ్చి స్టంపౌట్ అయ్యాడు. 37 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ కూడా మహరాజ్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది టీమిండియా... 

సంజూ శాంసన్‌తో కలిసి ఐదో వికెట్‌కి 67 పరుగుల భాగస్వామ్యం జోడించిన శ్రేయాస్ అయ్యర్, 33 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. కెరీర్‌లో 12వ వన్డే హాఫ్ సెంచరీ అందుకున్న శ్రేయాస్ అయ్యర్ 37 బంతుల్లో 8 ఫోర్లతో 50 పరుగులు చేసి లుంగి ఇంగిడి బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

భారత జట్టు భారీ తేడాతో ఓడిపోవడం ఖాయమనుకున్నారంతా. అయితే వస్తూనే బౌండరీ బాదిన శార్దూల్ ఠాకూర్, సంజూ శాంసన్‌తో కలిసి అద్భుతంగా పోరాడాడు. 49 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్‌తో కలిసి 66 బంతుల్లో 93 పరుగుల భాగస్వామ్యం జోడించాడు...

31 బంతుల్లో 5 ఫోర్లతో 33 పరుగులు చేసిన శార్దూల్ ఠాకూర్, లుంగి ఇంగిడి బౌలింగ్‌లో కేశవ్ మహారాజ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. శార్దూల్ ఠాకూర్ అవుట్ అయ్యే సమయానికి భారత జట్టు విజయానికి 15 బంతుల్లో 39 పరుగులు కావాలి...

వస్తూనే భారీ షాట్‌కి ప్రయత్నించిన కుల్దీప్ యాదవ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. వరుసగా రెండు బంతుల్లో 2 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఆవేశ్ ఖాన్ 6 బంతుల్లో 3 పరుగులు చేసి భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే రవి భిష్ణోయ్ కూడా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అయితే అది నో బాల్ కావడంతో ఫ్రీ హిట్ దొరికింది. ఆ బంతికి ఫోర్ బాదాడు భిష్ణోయ్, దీంతో ఆఖరి ఓవర్‌లో టీమిండియా విజయానికి 30 పరుగులు కావాల్సి వచ్చాయి...

వైడ్‌తో మొదలైన ఓవర్‌లో మొదటి బంతికి సిక్సర్ బాదాడు సంజూ శాంసన్. ఆ తర్వాతి బంతికి ఫోర్ వచ్చింది. మూడో బంతికి ఫోర్ బాదిన సంజూ శాంసన్, ఆఖరి 3 బంతుల్లో 15 పరుగులు కావాల్సిన స్థితికి చేర్చాడు. నాలుగో బంతికి బౌండరీ రాకపోవడంతో మ్యాచ్ రిజల్ట్ మారిపోయింది. ఐదో బంతికి ఫోర్ బాదిన సంజూ శాంసన్, ఆఖరి బంతికి సింగిల్ తీశాడు. 63 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 86 పరుగులు చేసిన సంజూ శాంసన్, వన్డే కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 40 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది సౌతాఫ్రికా. వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌ని 40 ఓవర్లకు కుదించారు అంపైర్లు... 


పిచ్ బ్యాటింగ్‌కి సహకరించకపోవడంతో ఓపెనర్లు ఆచి తూచి ఆడుతూ సెటిల్ అవ్వడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో 12 ఓవర్లు ముగిసే సమయానికి 49 పరుగులే చేయగలిగింది సౌతాఫ్రికా..

42 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసిన జాన్నెమన్ మలాన్‌ని అవుట్ చేసిన శార్దూల్ ఠాకూర్, టీమిండియాకి తొలి బ్రేక్ అందించాడు. టీ20 సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన కెప్టెన్ తెంబ భవుమా, తొలి వన్డేలోనూ అదే పర్ఫామెన్స్ రిపీట్ చేశాడు...

12 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు చేసిన భవుమా, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 5 బంతుల్లో పరుగులేమి చేయలేకపోయిన అయిడిన్ మార్క్‌రమ్‌ని కుల్దీప్ యాదవ్ క్లీన్‌ బౌల్డ్ చేశాడు. 71 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా...

54 బంతుల్లో 5 ఫోర్లతో 48 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 110 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికాని హెన్రీచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ కలిసి ఆదుకున్నారు...

భారత ఫీల్డర్లు క్యాచులు డ్రాప్ చేయడంతో ఆ అవకాశాలు అద్భుతంగా వాడుకున్న హెన్రీచ్ క్లాసెస్, డేవిడ్ మిల్లర్ ఐదో వికెట్‌కి 106 బంతుల్లో 139 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. డేవిడ్ మిల్లర్ 63 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు చేయగా క్లాసెన్ 65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు...

భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 8 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 35 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్, రవి భిష్ణోయ్ చెరో వికెట్ తీశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios