Asianet News TeluguAsianet News Telugu

రెండో టీ20కి ముందు టీమిండియాకు భారీ షాక్.. గాయంతో సంజూ శాంసన్ ఔట్..

INDvsSL T20I: స్వదేశంలో  శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ లో నేడు భారత్ రెండో టీ20 ఆడనుంది. ఈ మ్యాచ్ కు ముందు  టీమిండియాకు భారీ షాక్ తాకింది.   అసలే రాక రాక అవకాశం వచ్చిన సంజూ శాంసన్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. 

Sanju Samson ruled Out With Knee Injury, Jitesh Sharma Added The Squad
Author
First Published Jan 5, 2023, 9:48 AM IST

కొత్త ఏడాది శ్రీలంకతో  జరుగుతున్న టీ20 సిరీస్ లో  భాగంగా ముంబైలో జరిగిన తొలి మ్యాచ్ లో శుభారంభం చేసిన భారత జట్టు  నేడు పూణె వేదికగా  రెండో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది.  టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ గాయపడ్డాడు.  తొలి మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా అతడి మోకాలికి గాయమైంది.  దీంతో అతడు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.  అతడి స్థానంలో  విదర్భ క్రికెటర్, ఐపీఎల్ లో  పంజాబ్ కింగ్స్ తరఫున ఆడే  జితేశ్ శర్మను జట్టులోకి ఎంపిక చేశారు. 

తొలి టీ20లో  సంజూ  బ్యాటింగ్ లో విఫలమైన విషయం తెలిసిందే. అసలే అప్పుడప్పుడు అవకాశాలు దక్కించుకునే శాంసన్.. ఇలా ఆడటం వల్ల  ఉన్న ఛాన్స్ కూడా పోతుందని  అతడి మద్దతుదారులు ఆందోళన చెందుతుండగా  విధి గాయం రూపంలో అతడికి కాటు వేసింది.  

వాంఖడేలో ఫీల్డింగ్ చేస్తుండగా  శాంసన్ ఎడమ మోకాలికి గాయమైంది.   తొలి టీ20 ముగిసిన తర్వాత   టీమిండియా పూణెకు వెళ్లగా  శాంసన్ మాత్రం ముంబైలోనే ఆగిపోయాడు.  అతడు ప్రస్తుతం బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.   స్కానింగ్  తర్వాత  అతడి గాయం పరిశీలించి అనంతరం   అతడి అందుబాటుపై  నిర్ణయానికి రానున్నారు సెలక్టర్లు. 

 

రాహుల్ త్రిపాఠికి ఛాన్స్ వచ్చేనా..?

శాంసన్ కు గాయమైన నేపథ్యంలో గత కొంతకాలంగా బెంచ్ కే పరిమితమవుతున్న రాహుల్ త్రిపాఠికి   నేటి మ్యాచ్ లో  తుది జట్టులో చోటు దక్కే అవకాశమున్నట్టు  తెలుస్తున్నది.   టీమ్ లో ఇప్పటికే  స్పెషలిస్ట్ వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ ఉన్నాడు. తొలి మ్యాచ్ లో కూడా అతడే కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ నేపథ్యంలో జితేశ్ ను  జట్టులోకి ఎంపిక చేసినా మ్యాచ్ ఆడించడం కష్టమేనని  తెలుస్తున్నది. జితేశ్ ను పక్కనబెడితే త్రిపాఠికి  అవకాశం రావడం పక్కా..  గతేడాది ఐర్లాండ్ పర్యటన నుంచి జట్టుకు ఎంపికవుతున్నా  త్రిపాఠికి ఇంతవరకూ మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios