వరుసగా మూడు ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు గెలుపు ఖాతా తెరిచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.  

CSK vs DC : హ్యాట్రిక్ ఓటములతో డీలా పడ్డ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. సంజూ శాంసన్ విధ్వంసక సెంచరీ, జేమీ ఓవర్‌టన్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 23 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ సీజన్‌లో సీఎస్‌కేకి ఇది తొలి గెలుపు కాగా, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది రెండో ఓటమి.

గెలవాలంటే 213 పరుగుల భారీ లక్ష్యం.. ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ అదిరిపోయే ఆరంభం చేసింది. ఓపెనర్లు పతుమ్ నిస్సంక, కేఎల్ రాహుల్ తొలి 5 ఓవర్లలోనే 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ ఆ తర్వాత ఢిల్లీ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుప్పకూలింది. 18 పరుగులు చేసిన కేఎల్ రాహుల్‌ను ఖలీల్ అహ్మద్ పెవిలియన్ పంపాడు. ఆ వెంటనే, 24 బంతుల్లో 41 పరుగులతో ప్రమాదకరంగా మారుతున్న పతుమ్ నిస్సంకను అన్షుల్ కంబోజ్ ఔట్ చేశాడు.

ఇక కెప్టెన్ అక్షర్ పటేల్ (1), సమీర్ రిజ్వీ (6)లను ఒకే ఓవర్లో ఔట్ చేసిన జేమీ ఓవర్‌టన్.. ఢిల్లీని కోలుకోలేని దెబ్బ తీశాడు. డేవిడ్ మిల్లర్ కూడా కేవలం 17 పరుగులకే వెనుదిరిగాడు.

ట్రిస్టన్ స్టబ్స్ ఒంటరి పోరాటం వృథా

ఒకవైపు వికెట్లు పడుతున్నా, మరో ఎండ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసి మెరిశాడు. స్టబ్స్ క్రీజులో ఉన్నంత సేపు ఢిల్లీ గెలుపు ఆశలు సజీవంగానే ఉన్నాయి. కానీ 19వ ఓవర్లో స్టబ్స్‌ను కూడా ఔట్ చేసిన జేమీ ఓవర్‌టన్, చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని ఖాయం చేశాడు.

చెన్నై బౌలర్లలో జేమీ ఓవర్‌టన్ కేవలం 18 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ హీరోగా నిలిచాడు. అన్షుల్ కంబోజ్ 2 వికెట్లు తీయగా, ఖలీల్ అహ్మద్, గుర్జపనీత్ సింగ్, నూర్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.

సంజూ సెంచరీ.. సీఎస్‌కే భారీ స్కోరు

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ సీజన్‌లో తొలిసారి మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (15), సంజూ శాంసన్ తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించారు. ఆ తర్వాత రెండో వికెట్‌కు సంజూ శాంసన్, ఆయుష్ మాత్రే జోడీ కేవలం 68 బంతుల్లోనే 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి దుమ్మురేపింది.

తొలి మూడు మ్యాచుల్లో సింగిల్ డిజిట్‌కే ఔటై నిరాశపరిచిన సంజూ శాంసన్, ఈ మ్యాచ్‌లో విశ్వరూపం చూపించాడు. ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోస్తూ 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 115 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో సంజూకి ఇది నాలుగో సెంచరీ.

సంజూకి మరో ఎండ్‌లో ఆయుష్ మాత్రే (59) చక్కటి సహకారం అందించాడు. చివర్లో శివమ్ దూబే 20 పరుగులు చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేసింది.