గతేడాది వన్డే వరల్డ్ కప్ సమయంలో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ని  కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కించపరిచేలా మాట్లాడిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా.. జడేజాపై  మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియాతో టీమిండియా వన్డే మ్యాచ్ లో తలపడ్డారు. కాగా.. ఈ వన్డే సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లు ఓడిపోగా..  మూడో మ్యాచ్ గెలిచారు.

ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా మూడో వన్డేలో జడేజా 50 బంతుల్లో అజేయంగా 66 పరుగులు సాధించి జట్టు విజయంలో తనవంతు పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించడంతో సోనీ టీవీ కామెంటేటర్‌ ప్యానల్‌లో ఉన్న మంజ్రేకర్‌ తన మాటను సవరించుకోకతప్పలేదు. ఈ మ్యాచ్‌కు ముందు కూడా జడేజా లాంటి క్రికెటర్లను తాను జట్టులో ఎంపిక చేయనంటూ మంజ్రేకర్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే మూడో వన్డేలో టీమిండియా కష్టాల్లో పడ్డ సమయంలో జడేజా బ్యాట్‌ నుంచి ఒక మంచి ఇన్నింగ్స్‌ రావడంతో కామెంటేటర్‌గా ఉన్న మంజ్రేకర్‌ కొనియాడాడు. 

‘చివరి మూడు-నాలుగు ఓవర్లు జడేజా ఆడిన తీరు అమోఘం.  జడేజా ఆడిన తీరును ప్రశంసించకుండా ఉండలేకపోతున్నా. ఆఫ్‌ సైడ్‌, లెగ్‌ సైడ్‌ షాట్లతో జడేజా అలరించాడు.  జడేజా బ్యాటింగ్‌ పెర్ఫార్మాన్స్‌కు హ్యాట్సాఫ్‌. ఒక అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడాడు జడేజా. బంతితో కూడా జడేజా ఆకట్టుకున్నా ఇంకా ఎక్కువ తీయాలని కోరుకుంటున్నా. వన్డేల్లో జడేజా మరిన్ని వికెట్లను తీయాలి. గతేడాది కాలంగా జడేజా ప్రదర్శన మెరగవుతూ వస్తోంది. చాలా నిలకడగా ఆడుతున్నాడు. బ్యాటింగ్‌లో సత్తాచాటుతున్నాడు. కానీ బౌలింగ్‌లో ఇంకా మెరుగు కావాలి. భారత్‌కు ఇంకా ఎక్కువ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిపెట్టాలి’ అని మంజ్రేకర్‌ ప్రశంసిచాడు.