హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కు ఇష్టమైన క్రీడల్లో క్రికెట్ ఒకటి. ఆమె టెన్నిస్ కోర్ట్ తర్వాత ఎక్కువగా కనిపించేది క్రికెట్ మైదానంలోనే అందువల్లే ఆమె ఏరికోరి మరీ ఓ క్రికెటర్ ను పెళ్లాడింది. అయితే ప్రస్తుతం బిడ్డకు జన్మనిచ్చిన సానియా టెన్నిస్ కు కాస్త దూరంగా వుంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె క్రికెట్ మజాను పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. 

గత బుధవారం ఉప్పల్ వేదికగా జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు సానియా తన చెల్లి అనమ్ మీర్జాతో కలిసి మైదానానికి వచ్చారు. స్వతహాగా ప్యాషన్ డిజైనర్ అయిన ఆనమ్ తో పాటు సానియా కూడా ప్యాషనబుల్ దుస్తుల్లో కనిపించారు. 

ఇటీవలే తల్లిగా మారిన సానియా మొత్తం బ్లాక్ కలర్ దుస్తుల్లో మెరిసిపోగా...ఆమె చెల్లి అనమ్ బ్లూ టాప్, బ్లాక్ లెగ్గింగ్ ధరించి హైదరాబాధీ ట్రెడిషనల్ లో కొన్ని ఆభరణాలను ధరించి వచ్చారు. ఇలా తమకు ఫ్యాషన్ పై వున్న ఆసక్తిని తమ డ్రెస్సింగ్ ద్వారానే బయటపెట్టుకున్నారు ఈ మీర్జా సిస్టర్స్. 

ఇలా ఫ్యాషన్  తోనే కాదు తమ అభిమానంతో కూడా మీర్జా సిస్టర్స్ హైదరాబాదీ అభిమానులను ఆకట్టుకున్నారు. సన్ రైజర్స్ జట్టుకు మద్దతు ప్రకటిస్తూ ఆరంజ్ జెండాలను చేతబూని తెగ సందడి చేశారు. ఈ మ్యాచ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై జట్టుపై సన్ రైజర్స్ అద్భుత విజయాన్ని సాధించి మరో రెండు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది.