Asianet News TeluguAsianet News Telugu

పంత్ కోసం అతడి కెరీర్ ను నాశనం చేస్తారా...: టీమిండియా మేనేజ్‌మెంట్ పై కిర్మాణి ఆగ్రహం

వెస్టిండిస్ పర్యటనలో ఘోరంగా విఫలమవుతున్న రిషబ్ పంత్ పై మాజీ  వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గ్లోవ్స్ వేసుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కరు వికెట్ కీపర్ కాలేరంటూ ఘాటుగా విమర్శించాడు.  

Saha should play 2nd Test instead of Pant: Kirmani
Author
Hyderabad, First Published Aug 28, 2019, 3:58 PM IST

వెస్టిండిస్ పర్యటనలో భారత జట్టు  అదరగొడుతోంది. వరుసగా టీ20, వన్డే సీరిస్ లను క్లీన్ స్వీప్ చేసి టెస్ట్ సీరిస్ విజయానికి మరో అడుగు దూరంలో నిలిచింది. ఇలా భారత ఆటగాళ్లందరు అద్భుతంగా రాణిస్తుంటే వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం నిరాశపరుస్తున్నాడు. ధోని స్థానంలో వికెట్ కీపర్ గా విండీస్ పర్యటనకు ఎంపికైన అతడు ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. అంతేకాదు వికెట్ కీపర్ గా కూడా మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాడు. ఇలా అన్ని విభాగాల్లోనూ విఫలమవుతున్న పంత్ పై అభిమానుల నుండే కాదు మాజీల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇదే సమయంలో మరో వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహాకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ మొదలయ్యింది. రిషబ్ పంత్ పై టీమిండియా మేనేజ్‌మెంట్ ఎందుకంత ప్రేమ చూపిస్తోంది అర్థం కావడంలేదని అంటున్నారు. తాజాగా ఇలా పంత్ విఫలమవుతున్నా అధికంగా అవకాశాలివ్వడంపై మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీకూడా తప్పుబట్టాడు. 

''రిషబ్ పంత్ టాలెంట్ వున్న వికెట్ కీపరే. కానీ అతడింకా నేర్చుకునే స్థాయిలో వున్నాడు. కాబట్టి అతడి కోసం జట్టు ప్రయోజనాలను పనంగా పెట్టడం సరికాదు. వెస్టిండిస్ పై జరిగిన వన్డే,టీ20 సీరిస్ లతో పాటు మొదటి టెస్ట్ మ్యాచ్ లోనూ మళ్లీ అతడికే అవకాశమిచ్చారు. ఇకనైనా అతడిపై చూపిస్తున్న అతిప్రేమను తగ్గించుకోవాలి.

పంత్ కోసం మరో వికెట్ కీపర్ సాహాను నిర్లక్ష్యం చేయడం తగదు. వెస్టిండిస్ తో జరిగిన తొలి టెస్ట్ లో సాహాను ఆడిస్తారనుకున్నా. కానీ మేనేజ్ మెంట్ మళ్లీ  పంత్ పైనే భరోసా వుంచింది. ఇప్పటికైనా వరుసగా విఫలమవుతున్న పంత్ ని  పక్కనబెట్టి సాహాకు అవకాశమివ్వాలి. సాహా కేవలం వికెట్ కీపర్ గానే కాకుండా టెస్టులకు సరిపోయే నిలకడైన బ్యాటింగ్ గల ఆటగాడు. కేవలం గ్లోవ్స్ తొడుకున్న ప్రతిఒక్కరిని అత్యుత్తమ వికెట్ కీపర్ అనుకుంటే ఎలా. '' అంటూ కిర్మాణీ టీమిండియా మేనేజ్‌మెంట్ వ్యవహారాన్ని తప్పుబట్టాడు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios