Asianet News TeluguAsianet News Telugu

నా చెత్త రికార్డు బ్రేక్ అయినందుకు బాధగా ఉంది.. సఫారీ మాజీ స్పిన్నర్ ట్వీట్.. ఇది సెటైర్ కే బాప్ లా ఉందే..!

ENG vs IND: ఎడ్జబాస్టన్ టెస్టులో స్టువర్ట్ బ్రాడ్ ను బాధితుడిని చేస్తూ టీమిండియా తాత్కాలిక సారథి జస్ప్రీత్ బుమ్రా సాగించిన విధ్వంసంపై మాజీ క్రికెటర్లు  స్పందిస్తున్నారు. 
 

Sad To Lose My Record: Robin Peterson Hilarious Tweet on English Bowler Stuart Broad
Author
India, First Published Jul 3, 2022, 12:23 PM IST

ఇండియా-ఇంగ్లాండ్ మధ్య  ఎడ్జబాస్టన్ వేదికగా జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్టుల టీమిండియా తాత్కాలిక సారథి జస్ప్రీత్ బుమ్రా సాగించిన విధ్వంసం స్టువర్ట్ బ్రాడ్ ను మరోసారి చర్చనీయాంశంగా మార్చింది. 2007 టీ20 ప్రపంచకప్ లో  యువీ బాదుడికి బాధితుడిగా మారిన బ్రాడ్.. తన కెరీర్ చివరాంకంలో కూడా  అదే వ్యధను అనుభవించాడు. తాజాగా ఈ చెత్త రికార్డుకు పేటెంట్ హక్కులు కలిగిన మాజీ బౌలర్ బ్రాడ్ ను టార్గెట్ గా చేసుకుని చేసిన సెటైరికల్ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.  ఇంతకీ ఈ ట్వీట్ చేసిందెవరు..? అనుకుంటున్నారా..? సఫారీ మాజీ స్పిన్నర్ రాబిన్ పీటర్సన్. 

2003లో వాండరర్స్ లో దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మ్యాచ్ సందర్భంగా బ్రియాన్ లారా బాదుడుకు పీటర్సన్ బాధితుడయ్యాడు. అతడు వేసిన ఓ ఓవర్లో లారా.. 28 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్ లో లారా.. 4, 6, 6, 4, 4, 4 తో 28 పరుగులు చేయడంతో టెస్టు క్రికెట్ లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్ గా చెత్త రికార్డు నమోదు చేశాడు. 

19 ఏండ్ల తర్వాత ఇప్పుడు బ్రాడ్ ఆ రికార్డును చెరిపేస్తూ ఒక ఓవర్లో 35 పరుగులిచ్చాడు. ఇందులో బుమ్రా రాబట్టినవి 29 కాగా వైడ్, ఫోర్, నోబాల్ ద్వారా  మరో 6 పరుగులొచ్చాయి.  ఈ నేపథ్యంలో రాబిన్సన్ ట్విటర్ వేదికగా స్పందించాడు. 

‘నా రికార్డును కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది.. అయ్యో మరిచిపోయా.. రికార్డులనేవి ఉన్నవి బద్దలు కొట్టడానికే కదా.. ఇక తర్వాత రికార్డు కోసం వేచి  చూద్దాం..’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. అంతేగాక.. ‘ఈ రికార్డును బ్రేక్ చేయడానికి కేవలం 19 ఏండ్లు పట్టింది..’ అని మరో ట్వీట్ లో తెలిపాడు.

 

బ్రాడ్ వేసిన 84 ఓవర్లో బుమ్రా.. 4,  4 (వైడ్), 6 (నోబాల్), 4, 4, 6, 1.. ఇలా మొత్తంగా ఒకే ఓవర్లో 35 పరుగులు రాబట్టాడు. టెస్టులతో పాటు టీ20లలో కూడా బ్రాడ్.. భారత బ్యాటర్ల బాదితుడే. తొలి టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో బ్రాడ్ బౌలింగ్ లో యువీ.. వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన విషయం తెలిసిందే.  

రాబిన్సన్ తో పాటు బ్రాడ్ ను  టీమిండియా డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా దారుణంగా ట్రోల్ చేశాడు. ప్రముఖ బాలీవుడ్ చిత్రం ఢమాల్ లో వెటరన్ యాక్టర్ జావెద్ జాఫ్రీ మీమ్ ను షేర్ చేస్తూ.. ‘ఇవన్నీ నాకే ఎందుకు జరుగుతున్నాయి. ఈ ప్రమాదకర పరిస్థితుల్లోకి నేనెందుకు పడిపోతున్నా..’ అని రాసి ఉన్న మీమ్ ను వీరూ షేర్ చేశాడు. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఒక ఓవర్లో 35 రన్స్ ఇచ్చాక స్టువర్ట్ బ్రాడ్ పరిస్థితి ఇది..’ అని రాసుకొచ్చాడు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios