Asianet News TeluguAsianet News Telugu

BCCI: మీరు వేటు వేస్తే మేం అప్లై చేస్తాం..! మళ్లీ సెలక్షన్ కమిటీ రేసులో చేతన్ శర్మ, హర్వీందర్ సింగ్..?

BCCI Selection Committee: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొద్దిరోజుల క్రితమే  ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ  పై వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే చేతన్ శర్మ సారథ్యంలోని ఈ టీమ్ లో ఇద్దరు సభ్యులు మళ్లీ తమ పోస్టుల కోసం అప్లై  చేసుకున్నారని సమాచారం. 

Sacked Selectors Chethan Sharma and Harvinder Singh Re Applied, Reports
Author
First Published Dec 1, 2022, 2:37 PM IST

వరుసగా ఐసీసీ టోర్నీలతో పాటు కీలక  సిరీస్ లలో విఫలమవుతున్న భారత జట్టు ప్రదర్శనలతో విసిగపోయిన  బీసీసీఐ.. ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీపై వేటు వేసింది.  చేతన్ శర్మ సారథ్యంలోని  నలుగురు సభ్యులు గల జాతీయ సెలక్షన్ కమిటీ కొత్త సభ్యులు వచ్చే వరకు పదవిలో ఉండనుంది. ఈ మేరకు బీసీసీఐ నామినేషన్లను స్వీకరించింది. నవంబర్ 28కే తుదిగడువు ముగిసిన ఈ ప్రక్రియలో.. కొత్త ట్విస్ట్ లు  చేరాయి. బీసీసీఐ వేటు వేసిన చేతన్ శర్మ  అండ్ కో. లోని ఇద్దరు సభ్యులు (చేతన్ శర్మ, హర్వీందర్ సింగ్) లు తిరిగి  దరఖాస్తు చేసుకున్నట్టు   తెలుస్తున్నది. 

బీసీసీఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు..  ప్రస్తుత సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ తో పాటు సభ్యుడు హర్వీందర్ సింగ్ లు కూడా  కొత్త కమిటీలో పోస్టులకు అప్లై చేశారని  సమాచారం.   కొత్త సెలక్షన్ కమిటీ  కోసం వంద అప్లికేషన్లు రాగా.. అందులో ఈ ఇద్దరూ ఉన్నారని  తెలుస్తున్నది. 

నవంబర్ 28న తుది గడువు ముగియడంతో బీసీసీఐ ప్రస్తుతం ఈ దరఖాస్తులపై  పరిశీలన చేస్తున్నది. డిసెంబర్ 15 న తుది ఫలితం వెలువడనుంది.  అయితే రేసులో  పెద్ద తలకాయలు ఏమీ లేకపోవడంతో తిరిగి తమకు ఏదో ఒక పోస్టు ఖాయమనే అభిప్రాయంలో  ఉన్న చేతన్, హర్విందర్ లు తిరిగి  అప్లై చేసినట్టు సమాచారం. 

సెలక్షన్ కమిటీ రేసులో ఉన్నవారిలో  నయాన్ మోంగియా,  హేమాంగ్ బదానీ,   రాజేశ్ చౌహాన్, శివసుందర్ దాస్, మనీందర్ సింగ్, అజయ్ రత్ర, సమీర్ దిఘే లు ఉన్నట్టు సమాచారం. చేతన్ శర్మ అండ్ కో (సునీల్ జోషీ, దేబశీష్ మహంతి, హర్వీందర్ సింగ్) పై వేటు వేసిన తర్వాత  తర్వాత సెలక్షన్ కమిటీ  చైర్మెన్ రేసులో  అగార్కర్, శివరామకృష్ణన్ పేరు గట్టిగా వినిపించింది. ఈ ఇద్దరికీ బోర్డులో మంచి సంబంధాలు, పలుకుబడి ఉండటంతో  ఎవరో ఒకరిని పదవి వరించడం ఖాయం అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా కొత్త ముఖాలు కనిపిస్తుండటం గమనార్హం. 

 

తాజా సమాచారం మేరకు  తాను  ఏ పదవికీ అప్లై చేయలేదని హేమాంగ్ బదానీ  తన ట్విటర్ వేదికగా స్పష్టం చేశాడు. తనమీద వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పాడు.  తాజాగా నయాన్ మోంగియాతో పాటు టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.  

 

Follow Us:
Download App:
  • android
  • ios