పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి సంచలన కామెంట్స్ చేశాడు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కడం ఆయనకు అలవాటే. కాగా.. తాజాగా మరోసారి ఆయన తన వ్యాఖ్యలతో వివాదానికి ఎక్కారు.

 ‘‘పాకిస్థాన్ చేతిలో భారత జట్టు పలుమార్లు చిత్తుగా ఓడిపోంది. మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు మా వద్దకు వచ్చి కాస్తంత దయ చూపమని కోరేవారు’’ అంటూ వెటకారపు వ్యాఖ్యలు చేశాడు. అతడి వ్యాఖ్యలకు భారత అభిమానులు చెలరేగిపోయారు. 15 ఏళ్ల జాబితాను పోస్టు చేస్తూ భారత్ చేతిలో పాక్ ఎన్నిసార్లు ఓడిందో చెప్పాలంటూ ఆటాడుకున్నారు. 

అఫ్రిది తాజాగా, ఎప్పుడో తొమ్మిదేళ్ల నాటి వ్యాఖ్యలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి సమర్థించుకున్నాడు. షోయబ్ అక్తర్‌ను చూసి దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌ భయపడేవాడని చెప్పుకొచ్చాడు. అయితే, ఈ విషయాన్ని సచిన్ ఎప్పటికీ అంగీకరించడని అన్నాడు. షోయబ్‌ను సచిన్ ఎదుర్కొటున్నప్పుడు తాను కవర్స్‌లోనో, మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గమనించేవాడినని, అప్పుడు సచిన్ భయపడడాన్ని తాను చూశానని పేర్కొన్నాడు. 

అయితే, అక్తర్ బౌలింగ్‌కు తాను భయపడిన విషయాన్ని సచిన్ ఎప్పటికీ అంగీకరించడని, అక్తర్ బౌలింగ్‌కు సచిన్ ఒక్కడే కాదని, ప్రపంచంలోని దిగ్గజ ఆటగాళ్లు కూడా వణికేవారని అక్తర్ చెప్పుకొచ్చాడు. అక్తర్ బౌలింగులో సచిన్ అన్నిసార్లూ భయపడేవాడని తాను చెప్పడం లేదని, కొన్ని స్పెల్స్‌లో మాత్రం సచిన్‌ బ్యాక్‌ఫుట్‌కు వెళ్లేవాడని అక్తర్ పేర్కొన్నాడు.

 ‘అక్తర్ బౌలింగులో సచిన్ భయపడేవాడన్న 2011 నాటి వ్యాఖ్యలను ఇప్పటికీ సమర్థించుకుంటావా?’ అంటూ జైనాబ్ అబ్బాస్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ అఫ్రిది ఈ వ్యాఖ్యలు చేశాడు.